నేడు ఎస్పీఎం కార్మికుల ‘చలో తెలంగాణ భవన్’
ఆదిలాబాద్,ఏప్రిల్5(జనంసాక్షి): జిల్లాలో సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్దరణపై ఆశలు మృగ్యమయ్యాయి. ఇద్దరు మంత్రులు, ఒక అధికార ప్రతినిధి ఉన్నా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. దీంతో ఇక చివరి అస్త్రంగా కార్మికులు చలో హైదరాబాద్‌కు నిర్ణయించారు. మిల్లు పునరుద్ధరణపై ఆశలు సన్నగిల్లడంతో చివరి ప్రయత్నంగా ఎస్పీఎం సంరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీన ఉదయం 4 గంటలకు బాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లో కార్మికులు, కార్మికకుటుంబాలందరూ ‘చలో తెలంగాణ భవన్’కు సిద్ధమవుతున్నారు. తెలంగాణ భవనంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఎస్పీఎం పునరుద్ధరణపై స్పష్టమైన హావిూ ఇచ్చేంత వరకు భవనంలోనే బస చేసేందుకు కమిటీ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో సిఎం కెసిఆర్ సానుకూల ప్రకటన చేస్తారన్న ఆశతో కార్మికలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎకైక కాగితం మిల్లు(ఎస్పీఎం)యాజమాన్యం వైఖరితో మిల్లు మూతపడింది. యాజమాన్యం ఆధునీకరణ పేరిట కోట్లు రూపాయాలు వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించనందుకు గత మార్చి 4వ తేదీన ఐడీబీఐ బ్యాంక్ ఆధ్వర్యంలో మిల్లు ఆస్తులను స్వాధీనపర్చుకుంటున్నట్టు నోటీసులను జారీ చేసింది. తీసుకున్న రుణాలను యాజమాన్యం వ్యక్తిగత అవసరాలకు మళ్లించుకున్నట్లు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.