నేడు ఎస్సై అభ్యర్థుల ప్రిలిమ్స్ రాత పరీక్ష

* కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ

కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
నేడు జరగనున్న ఎస్సై అభ్యర్థుల ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ అన్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు రాత పరీక్ష కొనసాగుతుందని చెప్పారు.

ప్రిలిమ్స్ రాత పరీక్ష సందర్భాన్ని పురస్కరించుకొని రామకృష్ణాపూర్ కాలనీలోని వాగేశ్వరి, తిమ్మాపూర్, నుస్తులాపూర్ లలోని శ్రీ చైతన్య, జ్యోతిష్మతి, ఇంజనీరింగ్ కళాశాలలు, కాశ్మీర్ గడ్డలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాల, మంకమ్మ తోటలోని శ్రీ చైతన్య డిగ్రీ మరియు పీజీ కళాశాల, బైపాస్ రోడ్డు లోని వివేకానంద ఇంజనీరింగ్ కళాశాలలో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 11,854 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష జరిగే కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ, అవకతవకలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందుగా ఉదయం 9 గంటల వరకు చేరుకోవాలని చెప్పారు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా అభ్యర్థులను అనుమతించడం జరగదని స్పష్టం చేశారు. బయోమెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థుల హాజరును తీసుకోవడం జరుగుతుంది. హాల్ టికెట్ నకు ఎడమవైపున ఫోటోను అంటించి తీసుకురావాలి. సెల్ ఫోన్లను అనుమతించడం జరగదు. బ్లూ లేదా బ్లాక్ పెన్ను లను మాత్రమే తీసుకురావాలి.

* దళారులను ఆశ్రయించి మోసపోవద్దు

*పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ

ఎస్సై ఉద్యోగాల కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ అన్నారు. అభ్యర్థుల ప్రతిభ, సామర్థ్యాల ఆధారంగానే ప్రారదర్శకంగా ఎంపిక విధానం జరుగుతుందని చెప్పారు.
ఉద్యోగాలకు ఎంపిక చేస్తామంటూ మాయమాటలతో బోల్తా కొట్టించే దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వక్రమార్గంలో ఉద్యోగాలను సాధించడం అసాధ్యమని పేర్కొన్నారు. దళారుల ప్రలోభాలకు లోనై డబ్బులు అందజేయడం, వారు విధించే ఎలాంటి షరతులను అంగీకరించడం చేయకూడదని చెప్పారు. ఉద్యోగాలకు ఎంపిక చేస్తామంటూ సంచరించే దళారుల కదలికల పై ఏమాత్రం సమాచారం ఉన్నా పోలీసులకు తెలియజేయాలని కోరారు. అభ్యర్థుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మోసాలకు పాల్పడే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.