నేడు ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి

ఆదిలాబాద్‌, జూలై 19 : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు వసతి గృహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20వ తేదీన ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి రాజు తెలిపారు. జిల్లాలో అనేక వసతి గృహాల్లో తాగునీరు, మరుగుదొడ్లు లేక విద్యార్థులుసతమతమవుతున్నారని ఆయన తెలిపారు. అనేక పాఠశాలలు, కళాశాలకు ప్రహరీ గోడలు లేక, కొన్ని భవనాలు శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం చేపట్టే కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.