నేడు కరీంనగర్‌లో అమిత్ షా సభ
సర్వం సిద్దం చేసిన బిజెపి శ్రేణులు
భారీ జనసవిూకరణతో సత్తా చాటాలని నిర్ణయం
కరీంనగర్,అక్టోబర్9(జనంసాక్షి): బిజెపి ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా ఉత్తర తెలంగాణ కేంద్రంగా
కరీంనగర్‌లో ఈ నెల 10న బుధవారం నిర్వహిస్తున్న భాజపా ‘సమరభేరి’ బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. అమిత్‌షా పాల్గొననున్న సభకు జనాలను రప్పించేందుకు అంతా సిద్దం చేశారు. కరీనంగనర్ సభతో బిజెపి సత్తా చాటాలని కమలదళం చూస్తోంది. 21 నియోజకవర్గాల నుంచి లక్ష మందిని తరలించేలా ప్రయత్నించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ శక్తి కేంద్రాల బాధ్యులకు సూచించారు. ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో భాజపా ఇప్పటివరకు ఇంత పెద్దఎత్తున బహిరంగ సభ నిర్వహించలేదన్నారు. రాజకీయాలకు కేంద్రమైన కరీంనగర్ వేదికగా సమర శంఖం పూరించడానికి సభ ఏర్పాటు చేసింది. తెలంగాణలో భాజపాను మరింత పటిష్ఠం చేయడానికి దశల వారీగా జాతీయ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణలో పర్యటిస్తున్నారు. గతంతో పోలిస్తే భాజపాలో చేరేందుకు యువతతో పాటు ఇతర రాజకీయ నాయకులు ఆసక్తి చూపిస్తున్నారు. రానున్న రోజుల్లో తెరాసకు ధీటుగా భాజపా నిలుస్తుందన్న భావనలో నేతలు ఉన్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో దేశంతో పాటు తెలంగాణ అభివృద్ధికి ఎక్కువ శాతం నిధులు భాజపా ప్రభుత్వం విడుదల చేసిన విషయం ప్రజలకు వివరించనున్నారు. భాజపా అధికారంలో ఉన్న రాష్టాల్లో అభివృద్ధి.. తెలంగాణ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని బిజెపి నేతలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాల పేరు మార్చి పబ్బం గడుపుకొనేందుకు కేసీఆర్ పేర్ల విూద ఇక్కడ ఆయా పథకాలను అమలు చేసుకుంటున్నారని చెప్పారు. నాలుగున్నరేళ్ల కాలంలో తెరాస ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన తీరును ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈ అవకాశాన్ని భాజపా నాయకులు, కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి శక్తి కేంద్రం నుంచి
25 మంది చొప్పున సభకు హాజరయ్యేలా ఏర్పాటు చేశారు.
అమిత్‌షా రాకతో కరీంనగర్‌లో దారి మళ్లింపు
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 10వ తేదీన పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహిస్తున్న భాజపా ‘సమరభేరి’ సభ సందర్భంగా దారి మళ్లింపు చర్యలు తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి తెలిపారు. ఈ దారి మళ్లింపు చర్యలు బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి అమల్లోకి వస్తాయని అన్నారు. సభ పూర్తయ్యే వరకు దారి మళ్లింపు చర్యలు అమల్లో ఉంటాయని చెప్పారు. మానేరు జలాశయ సవిూపంలో ఉన్న క్రీడా పాఠశాల మైదానం, శాతవాహన విశ్వవిద్యాలయం, ఐటీ టవర్స్ ప్రాంతం, కొండ సత్యలక్ష్మి గార్డెన్స్, లక్ష్మి వేంకటేశ్వర దేవాలయం సవిూపంలోని స్థలాల్లో వాహనాలను నిలుపుదలకు కేటాయించినట్లు చెప్పారు. భారీ వాహనదారులు ఈ దారి మళ్లింపు చర్యలను గమనించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. అదే రోజు పంచాయితీరాజ్ శాఖకు సంబంధించిన అర్హత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం వేళ పరీక్ష ముగిసిన తర్వాత ఎటూ వెళ్లకుండా సదరు కేంద్రాల్లోనే ఉండి, దారి మళ్లింపు చర్యలు ముగిసిన తర్వాత ప్రయాణాలను కొనసాగించాలని సూచించారు. వివిధ ప్రాంతాల నుంచి వాహనాల్లో కరీంనగర్‌కు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
హైదరాబాద్, వరంగల్ : హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల నుండి సభా వేదిక వద్దకు వచ్చే వాహనాలు ఎన్‌టీఆర్ విగ్రహం, బద్దం ఎల్లారెడ్డి విగ్రహం, మైసూర్ బేకరీల విూదుగా చేరుకొని కట్టరాంపూర్‌లో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశంలో వాహనాలను నిలుపుదల చేయాలి. చొప్పదండి, మంచిర్యాల మార్గాల ద్వారా సభా వేదికకు చేరుకునే వాహనాలు నాఖాచౌరస్తా, పెద్దపల్లి ప్లై ఓవర్, బద్దం ఎల్లారెడ్డి విగ్రహం,
మైసూర్ బేకరీల విూదుగా సభా వేదికకు చేరుకుని కట్టరాంపూర్‌లో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశంలో వాహనాలను నిలుపుదల చేయాలి. పెద్దపల్లి, గోదావరిఖని పెద్దపల్లి, గోదావరిఖని ప్రాంతాల విూదుగా వచ్చే వాహనాలు బద్దం ఎల్లారెడ్డి విగ్రహం, మైసూర్ బేకరి విూదుగా సభావేదికకు చేరుకునే కట్టరాంపూర్‌లో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశంలో వాహనాలను నిలపాల/-సి ఉంటుంది. నిజామాబాద్, జగిత్యాల ప్రాంతాల నుండి వచ్చే వాహనాలు రేకుర్తి,శాతవాహన విశ్వవిద్యాలయం, చింతకుంట క్రాస్‌రోడ్, పద్మనగర్ బైపాస్, రాంచంద్రాపూర్ కాలనీ విూదుగా సభావేదికకు చేరుకొని కట్టరాంపూర్‌లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. రిసిల్ల, వేములవాడ ప్రాంతాల నుండి వచ్చే వాహనాలు చింతకుంట క్రాస్‌రోడ్డు, సిరిసిల్ల, బైపాస్, రాంచంద్రాపూర్‌కాలనీ విూదుగా సభా వేదికకు చేరుకుని కట్టరాంపూర్‌లో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలపాలని సిపి పేర్కొన్నారు.