నేడు కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు


223 స్థానాలకు ఎన్నికలు

ఉదయం 7 నుంచి పోలింగ్‌
భారీగా ఏర్పాట్లు చేసిన ఇసి
బెంగళూర్‌,మే11(జ‌నం సాక్షి ):  కర్ణాటకలో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి సంజీవ్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ  ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సంజీవ్‌ కుమార్‌ కోరారు. ఎవరికీ ఓటు వేశామో ఓటరు చూసుకునేలా వీవీప్యాట్‌ యంత్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని సంజీవ్‌ కుమార్‌ హెచ్చరించారు.  కర్ణాటక శాసన సభ ఎన్నికలకు గురువారం ప్రచారం ముగియగా.. అన్ని పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నాయి. కర్ణాటకలో మొత్తం 224 నియోజకవర్గాలు ఉండగా.. బెంగళూరులోని జయనగర అభ్యర్థి విజయకుమార్‌ ఆకస్మిక మరణంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. మిగిలిన 223 నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్‌ జరగనుండగా ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మేరకు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు, మద్యం, ఇతర కానుకలను పంపుతున్నాయి. ఆర్‌ఆర్‌నగర్‌లో ఎన్నిక వాయిదా అంశం తమ పరిధిలో లేదని, ఎన్నిక వాయిదాపై సీఈసీ నిర్ణయం తీసుకోవాలని సంజీవ్‌ కుమార్‌ అన్నారు.
మరోవైపు ఇలాంటి చర్యలను అడ్డుకునేందుకు ఈసీ పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో పోలీసులు సోదాలు చేపట్టి చిత్రదుర్గ జిల్లా మొలకల్మూరులోని ఎద్దలబొమ్మనహట్టి వద్ద రూ.2.17కోట్ల నగదును పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి మొలకల్మూరుకు స్కార్పియోలో నగదు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి ఐటీ, పోలీసు, అబ్కారీ శాఖల తనిఖీల్లో రూ.80.91కోట్ల నగదు, రూ.24.36 కోట్ల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. రూ.44.26 కోట్ల విలువైన బంగారం, వెండి స్వాధీనం చేసుకున్న ఐటీశాఖ.. ఇప్పటి వరకూ రూ.176 కోట్ల నగదు, ఆభరణాలను జప్తు చేసింది.