నేడు కెసిఆర్‌, హరీష్‌ రావుల నామినేషన్‌

కోనాయపల్లి, గజ్వెల్‌లో భారీ భద్రత

సిద్దిపేట,నవంబర్‌13(జ‌నంసాక్షి): సిఎం కెసిఆర్‌, మంత్రి హరీష్‌ రావులు బుధవారం నామినేషన్లు వేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తన ఇష్టదైవం కోనాయిపల్లి వెంకన్నకు మొక్కి కేసీఆర్‌ ఈనెల 14వ తేదీన నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. దీంతో కోనాయపసల్లితో పాటు గజ్వెల్‌లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు కేసీఆర్‌ నంగునూరు మండలంలోని కోనాయిపల్లికి వెళ్లి పూజలు చేస్తారు. స్వామివారి విగ్రహం వద్ద నామినేషన్‌ పత్రాలను ఉంచి పూజలు చేసిన తర్వాత ఆలయంలోనే పత్రాలపై సంతకాలు చేస్తారు. ఈ సందర్భంగా ఆలయం బయట గ్రామస్తులనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి గజ్వేల్‌లోని ఆర్డీవో కార్యాలయానికి వచ్చి నామపత్రాలు దాఖలు చేస్తారు. మధ్యాహ్నం 2.34 గంటల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నామపత్రాలు సమర్పించనున్నారు. ఆయనతో పాటు వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే పూజల్లో పాల్గొననున్న మంత్రి హరీశ్‌రావు మధ్యాహ్నం 2.30 నుంచి 3 గంటలలోపు నామినేషన్‌ వేయనున్నారు. 1985 నుంచి ప్రతి ఎన్నిక సందర్భంగా కేసీఆర్‌ కోనాయిపల్లికి వచ్చి వెంకటేశ్వరస్వామికి పూజలు చేశాకే నామపత్రాలు దాఖలు చేస్తారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని చేపట్టినప్పుడు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాకనే తెరాస ఆవిర్భావాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి ఇదే సెంటిమెంట్‌ను కేసీఆర్‌ కొనసాగిస్తున్నారు. 2004లో కేసీఆర్‌ ఇక్కడి నుంచి గెలుపొందిన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ ఏడాది జరిగిన ఉప ఎన్నికలో ఇక్కడి నుంచి పోటీ చేసిన హరీశ్‌ కూడా ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ కోనాయిపల్లికి రానున్నందున భద్రత కట్టుదిట్టం చేశారు.