నేడు నిర్ణయ దోషులకు ఉరి

ముంబయి,మార్చి 19(జనంసాక్షి): నిర్భయ దోషుల ఉరితీతకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తిహాడ్ కేంద్ర కారాగారంలో శు క్రవారం ఉదయం 5:30 గంటలకు దోషులను ఉరితీయనున్నారు. ఎట్టకేలకు ముకేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మ ఉరికంబం ఎక్కనున్నారు. జైలు అధికారులు బుధవారమే డమ్మీ ఉరి తీశారు. తలారి పవన్ జల్లాడ్ సహా అధికారుల బృందం మూడో కారాగారంలోని ఉరితీసే చోటును గురువారం పరిశీలించారు. బిహార్‌లోని బక్సార్ నుంచి 10 ఉరితాళ్లను ఇంతకు ముందే తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వాటిని గురువారం సాయంత్రం మరోసారి ఉరికంబాలకు బిగించి పరీక్షించనున్నారు. ఉరి అమలు చేసేందుకు వచ్చిన తలారి పవన్ జల్లాడ్ ది ఉత్తర్ ప్రదేశ్ లోని మేరర్. ఉత్తర్ ప్రదేశ్ జైళ్ల శాఖలో పనిచేస్తున్న అతడిని తిహాడ్ అధికారులు ఈ పని కోసమే తీసుకొచ్చారు. నలుగురినీ ఒకేసారి ఉరితీసినందుకు ఆయనకు రూ.15,000 పారితోషికం ఇస్తారు. శుక్రవారం ఉదయం ఉరితీసే సమయంలో పవన్‌తో పాటు

ఒక వైద్యుడు, కొద్దిమంది అధికారులు మాత్రమే ఉంటారు. గురువారం సాయంత్రం ఉరితీత ఏర్పాట్లన్నీ మరోసారి పరిశీలిస్తాం. జైలు సూపరింటెండెంట్లు దోషులతో సాయంత్రం మాట్లాడతారు. చివరి కోరికలేమైనా ఉన్నాయేమో రాసివ్వమంటారు. శిక్షణ పొందిన కౌన్సిలర్లు వారికి కౌన్సిలింగ్ ఇస్తారు. నలుగురు దోషులు ప్రస్తుతం మూడో నంబర్ జైలులోనే ఉన్నారు. వారి కదలికలను గమనించేందుకు ఇద్దరు ముగ్గురు అధికారులు ప్రత్యేకంగా గస్తీ కాస్తారు’ అని జైల్లోని ఓ అధికారి తెలిపారు. ఉరితీత ప్రక్రియ మొత్తం గంట సేపట్లో పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. ‘శిక్ష ఎప్పుడో ఖరారైనా ఉరితీత రెండుసార్లు వాయిదా పడింది. వారి చివరి కోరికేంటో ప్రత్యేకంగా చెప్పలేదు. వారి ముఖాల్లో భయం, కుంగుబాటు లేదు. అయితే బుధవారం సాయంత్రం నుంచి వారి ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది. వారితో ఎక్కువగా మాట్లాడొద్దని పై అధికారులు మాకు సూచించారు’ అని మరో అధికారి వెల్లడించారు. 2013, ఫిబ్రవరి 9న చివరిసారి తిహాడ్ కారాగారంలో అఫ్టల్ గురూని ఉరితీశారు.