నేడు మునిసిపల్‌ కౌన్సిల్‌ హాలుకు తాళం

నేటితో ముగియనున్న కౌన్సిల్‌ పదవీకాలం
ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి తక్కువ, హడావుడి ఎక్కువ
శివారు ప్రాంతాల్లో జాడలేని అభివృద్ధి
అభివృద్ది అంటే కార్యాలయం నిర్మాణం, రామతీర్ధం మంచినీరేనా?
కందుకూరు, జూలై 18 : గత ఐదు సంవత్సరాలుగా ప్రజలకు చేసిన పనులు తక్కువ చేపట్టిన హడావుడి ఎక్కువ అని విమర్శలు ఎదుర్కొన్న మునిసిపల్‌ కౌన్సిల్‌ పదవీకాలం గురువారంతో పూర్తవుతున్న సందర్భంగా నేటి నుండి మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశం హాలు నిర్మానుష్యంగా మారనుంది. ఐదు సంవత్సరాల పదవీకాలంలో 60 సమావేశాలకు వేదికైన సమావేశం హాలు అనేక సందర్భాలను, మాటల తూటాలను వెకిలి చేష్టలను పట్టణ అభివృద్దికి సహకరించని మాటల బేరడిని అధికారుల నిర్లక్ష్యాన్ని కౌన్సిలర్ల ఉదాసీనతను గమనించింది. ఐదు సంవత్సరాల పదవీకాలంలో పట్టణం సీమంత పెద్దగా అభివృద్ధి పథంలో పయనించలేదన్నది వాస్తవం. రాజకీయ అనుభవం లేని వెనుకబడిన వర్గాలకు చెందిన మునిసిపల్‌ ఛైర్మన్‌ బూర్సు మాలకొండయ్య వ్యవహారం మంత్రి మహీధర్‌రెడ్డి రాజకీయ చతురత, మునిసిపల్‌ అధికారుల వ్యవహార శైలి వలన మొదటి మూడు సంవత్సరాలు వాదనలు, ఘర్షణలు, సవాళ్లతోటి సమావేశాలు, పదవీకాలాలు పూర్తి కావడం జరిగింది. సంవత్సరానికి ఒక కమీషనర్‌ మారడం వలన వచ్చిన ప్రతి కమీషనర్‌ చేతికందినంత దోచుకొని వెళ్లడం జరిగిందనే విమర్శలు ప్రతి కౌన్సిల్‌ సమావేశంలో గొడవలకు కారణమయ్యాయి. అదే విధంగా మునిసిపల్‌ గ్రాంట్లు, కేటాయింపుల్లో మంత్రి జోక్యం మితిమీరినందున అనేక సమయాల్లో వాదనలు, ఘర్షణలకు తావిచ్చిందనే విమర్శలు ఉన్నాయి. అదే విధంగా గత ఐదు సంవత్సరాల నుండి గుండంకట్ట అభివృద్ధి చేస్తామన్న మాటల బేరడి వాస్తవరూపం పదవీకాలం పూర్తి అవుతున్నా ఏ సమయంలో కూడా పూర్తికాకపోవడం విచారకరం. అదే విధంగా వందలకోట్ల నిధులు వచ్చినా అభివృద్ది మాత్రం పట్టణ నడిబొడ్డున మినహాయించి శివారు ప్రాంతాల్లో అభివృద్ది జాడలే లేక మారుమూల పల్లె ప్రాంతాలను తలపింపచేస్తున్నాయి. ఇక ఊరిస్తూ వస్తున్న రాజీవ్‌ ఆవాస్‌ యోజన అండర్‌ డ్రైనేజీ వాస్తవ కార్యక్రమం ప్రారంభం ఎక్కడ అని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ది అంటే కార్యాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవడం, రామతీర్దం నీళ్లు ప్రజలకు అందించడమేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఐదు సంవత్సరాల కాలంలో అనేక వింతలు, విశేషాలు, వాదనలు అరుపులు, కేకలు, ఆలవాలమైన మునిసిపల్‌ కౌన్సిల్‌ పదవీకాలం నేటితో ముగియనుంది.