నేత కార్మికులు కాదు..కళాకారులు
త్వరలోనే రైలు కూత వింటామని వెల్లడి
రాజన్న సిరిసిల్ల,నవంబర్2(జనంసాక్షి): ఎలాంటి స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ లేకుండానే అద్భుతమైన వస్త్రాలు తయారు చేసే నైపుణ్యం నేతన్నలదని మంత్రి కేటీఆర్ అభినందించారు. అందుకే వాళ్లను చేనేత కార్మికులు కాదు.. చేనేత కళాకారులు అని పిలవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో పద్మశాలి వస్త్ర పరిశ్రమ సంఘం ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ జరిగింది. ఈ సభకు మంత్రి కేటీఆర్, ఎంపీ వినోద్ హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… పద్మశాలీల అభిమానాన్ని జీవితాంతం మరిచిపోలేను. నేత పరిశ్రమ కాపాడండి.. మమ్మల్ని ఆదుకోండని నేతన్నలు గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వాలకు మొర పెట్టుకున్నారు. నేతన్నల ఆత్మహత్యలు పాటలుగా పాడుకునే దుస్థితిని అనుభవించినం. నేతన్నలను బాగు చేయడానికి ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని వి వరించారు. నేతన్నలను సంక్షోభం నుంచి సంక్షేమం వైపు తీసుకెళ్లేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారు. నేతన్నల కోసం ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఎప్పటికప్పుడు మారుతూ.. అత్యవసరమైనవి వస్త్రాలు. ప్రపంచ వస్త్ర వ్యాపారంలో దేశం ఎంతో వెనుకబడింది. జనాభా పరంగా చిన్న దేశాలు మన కంటే ఎక్కువ వస్త్రాలు తయారు చేస్తున్నాయి. ప్రపంచానికి అవసరమైన వస్త్రాల్లో 40 శాతం చైనా తయారు చేస్తోంది. బంగ్లాదేశ 14 శాతం, శ్రీలంక 8 శాతం వస్త్రాలు తయారు చేస్తున్నాయి. భారత్ కేవలం 4 శాతం వస్త్రాలనే తయారు చేస్తోంది. వ్యవసాయం తర్వాత అత్యంత ఎక్కువ ఉపాధి కల్పించే రంగం చేనేతనే. చేనత, జౌళి పరిశ్రమ అభివృద్ధికి నావంతు కృషి చేస్తున్నా.. అని కేటీఆర్ తెలిపారు.
గతంలో నల్లగొండ జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నలను అప్పటి చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. అప్పుడు కేసీఆర్ జోలె పట్టి విరాళాలు సేకరించి బాధిత కుటుంబాలను ఆదుకున్నరు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చేనేత, జౌళిశాఖకు రూ.70 కోట్ల నుంచి రూ.1270 కోట్ల బ్జడెట్ పెంచిన ఘనత కేసీఆర్‌ది. నేతన్నల కష్టాలు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ వాళ్లను ఆదుకునేందుకు అనేక చర్యలు చేపట్టారు. సిరిసిల్ల బతుకమ్మ చీరలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలంతా గర్వంగా గుండెలకు హత్తుకుంటున్నారు. వచ్చే రెండుమూడేళ్లలో సిరిసిల్లలో రైలు కూత వినిపిస్తుంది.. అని మంత్రి తెలిపారు. మంత్రి కేటీఆర్‌తోనే సిరిసిల్లలో అభివృద్ధి సాధ్యమయిందని ఎంపి వినోద్ అన్నారు. త్వరలోనే
సిరిసిల్లకు రైలుమార్గం రాబోతుందన్నారు. వారు తమ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తీసుకుని వెళ్లే అవకాశం రానుందన్నారు.




