నేపాల్‌ చేరుకున్న మోడీకి ఘనంగా స్వాగతం

జనక్‌పూర్‌-అయోధ్య బస్సుకు ప్రారంభం
ఖాట్మండు,మే11(జ‌నం సాక్షి ): రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ నేపాల్‌కు చేరుకున్నారు. జనక్‌పురి ఎయిర్‌పోర్టులో ఆయనకు ఘన స్వాగతం లభించింది. మోడీ తొలుత సీతాదేవి జన్మస్థలమైన జనక్‌పురిని సందర్శించారు. అనంతరం నేపాల్‌ ప్రెసిడెంట్‌ విద్యాదేవీ భండారీ, ఉపాధ్యక్షుడు నంద బహదూర్‌ పున్‌, ప్రధాని కేపీ ఓలిలతో ప్రధాని సమావేశం కానున్నారు. భారత్‌ సాయంతో నేపాల్‌లో చేపట్టిన మౌలిక సదుపాయాల పనుల్ని మోడీ సవిూక్షించనున్నారు. సాయంత్రం జరగనున్న చర్చల్లో  మోడీ, ఓలి ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. 6వేల కోట్ల రూపాయల వ్యయంగా నిర్మించిన అరుణ్‌ త్రీ జల విద్యుత్‌ కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం ఓలి ఇచ్చే విందులో మోడీ పాల్గొననున్నారు. మరోవైపు నేపాల్‌ – భారత్‌ మధ్య బస్సు సర్వీస్‌ ప్రారంభమైంది. నేపాల్‌ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి కలిసి బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు. నేపాల్‌లోని జనక్‌పూర్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య వరకు బస్సు సర్వీస్‌ అందుబాటులో ఉండనుంది. ఇక జానకీ టెంపుల్‌ను మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఓ వాయిద్య పరికరాన్ని మోదీ వాయించారు.  ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా  అన్నారు. నేపాల్‌లో పర్యటిస్తున్న ఆయన ఆ దేశ ప్రధాని కే పీ ఓలితో కలిసి శుక్రవారం జనక్‌పూర్‌ – అయోధ్య – జనక్‌పూర్‌ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సు ప్రయాణ మార్గం రామయణ్‌ సర్క్యూట్‌లో భాగం. ఈ రామాయణ్‌ సర్క్యూట్‌కు గొప్ప ఆదరణ లభిస్తుందని మోదీ అన్నారు. సీతా దేవి జన్మ స్థలం జనక్‌పురి అని, శ్రీరాముడి జన్మ స్థలం అయోధ్య అని శ్రీరామాయణం చెప్తున్న సంగతి తెలిసిందే. జనక్‌పురిలోని జానకి దేవాలయాన్ని విశిష్టమైన వాస్తు కళా నైపుణ్యంతో నిర్మించినట్లు యునెస్కో (ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ) ప్రకటించింది. సాయంత్రం వేళ అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని, ఆ సమయంలో ఈ దేవాలయాన్ని సందర్శించినవారికి గొప్ప అనుభూతి కలుగుతుందని పర్యాటక రంగంలో అనుభవజ్ఞులు చెప్తున్నారు. సప్తవర్ణ శోభితమైన దీపాల కాంతులు మరొక ఆకర్షణ అని అంటున్నారు. హిందు-కొయిరి నేపాలీ వాస్తు రీతిలో జానకి మందిరాన్ని నిర్మించారు. నేపాల్‌లోని మిథిల ప్రాంతంలో ఈ దేవాలయం ఉంది. 4,860 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రకాశవంతమైన తెల్లని దేవాలయం ఠీవిగా కనిపిస్తుంది. మొఘల్‌, కొయిరీ బురుజుల సమ్మేళనంతో మూడు అంతస్థులుగల ఈ దేవాలయం ఎత్తు 50 విూటర్లు. రామాయణం ప్రకారం విదేహ రాజ్యాన్ని పరిపాలించిన జనక మహారాజు కుమార్తె సీతా దేవి. స్వయంవరంలో రాముడిని వివాహమాడిన సీతాదేవి అయోధ్య రాజ్యానికి మహారాణి అయింది. వీరి వివాహం జానకి మందిరానికి సవిూపంలోని ఓ దేవాలయంలో జరిగినట్లు తెలుస్తోంది. దీనిని వివాహ మండపం అని కూడా పిలుస్తున్నారు.
ఏటా వేలాది మంది భక్తులు జానకి మందిరాన్ని సందర్శిస్తూ ఉంటారు. నేపాల్‌, శ్రీలంక, భారతదేశం నుంచి భక్తులు వెళ్తూ ఉంటారు. శ్రీరామ నవమి, వివాహ పంచమి వంటి ముఖ్యమైన పండుగల సందర్భంగా అత్యధికంగా భక్తులు సీతారాములను దర్శించుకుంటారు.
————-