నేరేడ్‌మెట్‌లో తెరాసదే విజయం

– 56కు చేరిన టీఆర్‌ఎస్‌ బలం

హైదరాబాద్‌,డిసెంబరు 9 (జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ పరిధిలోని నేరేడ్‌మెట్‌ ఫలితం వెల్లడైంది. ఇక్కడ తెరాస అభ్యర్థి విజయం సాధించారు. 668 ఓట్ల ఆధిక్యంతో తెరాస అభ్యర్థి విూనా ఉపేందర్‌ రెడ్డి గెలుపొందారు. జీహెచ్‌ఎంసీ ఫలితాలు వెలువడిన ఈ నెల 4వ తేదీనే నేరేడ్‌మెట్‌ డివిజన్‌ లెక్కింపు చేపట్టారు. అయితే తెరాస అభ్యర్థి 504 ఓట్ల మెజారిటీలో ఉన్నప్పటికీ ఇతర ముద్రతో ఉన్న ఓట్లు 544 ఉన్నాయి. ఇతర ముద్రతో ఉన్న ఓట్లు మెజారిటీ కంటే ఎక్కువగా ఉండటంతో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆ డివిజన్‌ ఫలితాన్ని ప్రకటించలేదు. తాజాగా ఇతర ముద్రలు ఉన్న ఓట్లు పరిగణనలోకి తీసుకునేందుకు హైకోర్టు అనుమతించడంతో నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో లెక్కింపును ఈ ఉదయం చేపట్టారు. సైనిక్‌పురిలోని భవన్స్‌ వివేకానంద కళాశాలలో లెక్కింపు కొనసాగింది. ఇతర గుర్తులున్న 544 ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇంతకుముందు ఆధిక్యంలో ఉన్న తెరాస అభ్యర్థే ఇక్కడ విజయం సాధించారు. ఫలితం అనుకూలంగా రాకపోవడంతో కౌంటింగ్‌ కేంద్రం నుంచి కంటతడి పెడుతూ భాజపా అభ్యర్థి ప్రసన్న నాయుడు బయటకు వచ్చారు. ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారంటూ ఆరోపించారు.భాజపా అభ్యర్థి ప్రసన్న నాయుడు చేసిన ఆరోపణలపై రిటర్నింగ్‌ అధికారి లీనా స్పందించారు. తాను ఏ అభ్యర్థికి, పార్టీకి అనుకూలంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. తనపై అనేక ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన విధులకు ఆటంకం కల్పించి వ్యక్తిగతంగా దూషించిన వారిపై నేరేడ్‌మెట్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆమె చెప్పారు. ఎన్నికల సంఘానికి కూడా నివేదిక ఇవ్వనున్నట్లు లీనా తెలిపారు.