నోయిడాలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్య
నోయిడా :అక్టోబర్18(జనంసాక్షి):
దేశ రాజధాని ఢిల్లీకి సవిూపంలోని నోయిడాలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. తోటి స్నేహితులే దారుణంగా కాల్చిచంపారు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన సందేశ్ అనే విద్యారి నోయిడాలోని అమేఠి యూనివర్సిటీలో బీఎస్సీ మెరైన్ సైన్స్(రెండో సంవత్సరం) అభ్యసిస్తున్నాడు. నోయిడాలోని అద్దె గదిలో సందేశ్ తన స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. అయితే శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు అమన్ అనే స్నేహితుడు మరో వ్యక్తితో కలిసి సందేశ్ గదికి వచ్చాడు. గదిలోకి రాగానే సందేశ్‌పై అమన్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. గదిలో ఉన్న మరో విద్యార్థిపై కూడా కాల్పులు జరిపేందుకు యత్నించగా అతడు డోర్ పెట్టుకున్నాడు. అనంతరం అమన్ అటు నుంచి పారిపోయాడు. గదిలో ఉన్న మరో విద్యార్థి ఇరుగుపొరుగు వారి సహాయంతో సందేశ్‌ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సందేశ్ కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. సందేశ్ హత్యకు గురయ్యాడని వార్త తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు హుటాహుటిని నోయిడాకు బయల్దేరారు. ఆదివారం సందేశ్ మృతదేహాన్ని అతడి తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు.
శ్రీనగర్ కాలనీలో విషాదఛాయలు
సందేశ్ మరణవార్త తెలుసుకున్న అతడి కుటుంబ సభ్యులు, బంధువులు, కాలనీ వాసులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. సందేశ్ మంచి అబ్బాయి.. ఎవరితోనూ గొడవ పెట్టుకునే రకం కాదు. ఫ్రెండ్లీగా ఉంటాడు. అసలు సందేశ్‌ను చంపారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాం. ఆ వార్త నిజం కాకుంటే బాగుండు. దసరా పండుగకు రాను. దీపావళికి వస్తా వాళ్ల అమ్మకు సందేశ్ ఫోన్ చేసి చెప్పాడంట. వాళ్లమ్మ తమతో చెప్పిందని కాలనీ వాసులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.