పంచాయతీ ఎన్నికలకుసర్కారు సిద్ధం;మంత్రి జానారెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 (జనంసాక్షి):
పంచాయితీ ఎన్నికలపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఆ శాఖమంత్రి కె.జానారెడ్డి స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. సోమవారంనాడు సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీం తీర్పు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారమే ఎన్నికలు జరుపుతామన్నారు. నిబంధనలను అనుసరించి పంచాయతీ ఎన్నికలను పూర్తి చేస్తామన్నారు. రిజర్వేషన్లు, కోర్టు వివాదాల వల్ల పంచాయతీ ఎన్నికలు జాప్యమయ్యాయని అన్నారు. ఎన్నికలు సకాలంలో జరపకపోవడం పట్ల ప్రభుత్వం కూడా ఆందోళన చెందిందన్నారు. దీనిని సాకుగా తీసుకుని పలు రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పించాయన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేసిందన్నారు. సంబంధిత శాఖా మంత్రిగా ఆనం, ప్రభుత్వం చేసిన చిత్తశుద్ధి కృషికి ఇది నిదర్శనమన్నారు. త్వరలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి కేంద్ర నుంచి రావాల్సిన దాదాపు రూ.17వందల కోట్ల నిధులను తెచ్చుకుంటామని అన్నారు. ఈ నిధులతో పాటు వచ్చే ఏడాది నిధులను కూడా ఇచ్చేందుకు కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో 21,840 పంచాయతీలు, 11వందల ఎంపిటీలు, 22 జడ్పీటీసీలు ఉన్నాయన్నారు. అయితే ఇటీవల కాలంలో కొత్తగా కొన్ని నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం వల్ల వాటిలో కొన్ని కలిసిపోయి ఉండవచ్చన్నారు. ఆ సంఖ్యను లెక్కగడుతున్నామని, అవి 150వరకు  ఉండొచ్చని జానారెడ్డి చెప్పారు. దీంతో సుమారుగా 20,700ల పంచాయితీలు ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తాండాలను పంచాయితీలుగా మార్చే అంశంపై ప్రశ్నించగా ప్రజల సౌకర్యం కోసం అవకాశం ఉన్నచోట్ల తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. బీసీ సర్టిఫికెట్‌ ఉంటే బీసీ రిజర్వేషన్‌ స్థానాలలో ఎవరైనా పోటీ చేయవచ్చన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు చట్టంలో ఎలాంటి నిబంధన లేదన్నారు. అయితే ముస్లీం మైనారీటిలకు కో- ఆప్షన్‌ పద్దతిన అవకాశం కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎస్సీలకు 18.3శాతం, ఎస్టీలకు 8.25శాతం, బీసీలకు 34శాతం రిజర్వేషన్ల విధానంతో ఎన్నికలకు వెళతామని అన్నారు. దీనికి సంబంధించి పేర్కొన్నారు.