పంచాయితీల్లోనూ సత్తా చాటాలి: షిండే
నిజామాబాద్,డిసెంబర్25(జనంసాక్షి): పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటేలా కార్యకర్తలు కృషిచేయాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ. 2 లక్షలు రుణ మాఫీ చేస్తామని చెప్పారని, తాము లక్ష రూపాయలు మాఫీ చేస్తామని చెప్పామని… అయినా ప్రజలు కాంగ్రెస్ను నమ్మలేదన్నారు. పార్టీల నాయకులందరూ కలిసి మహాకూటమి గా ఏర్పడి ఎన్నికల్లో గెలవాలని ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి, అభ్యున్నతి సాధ్యమని నమ్మారని, నమ్మకాన్ని నిజం చేస్తామన్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు, తన గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రైతుబంధు పథకం గురించి ఐక్యరాజ్యసమితిలో సైతం చర్చ జరిగిందని తెలిపారు. ఇతర పార్టీల వారికి గ్రామాల్లో ఓట్లు పడని పరిస్థితి ఉందని అన్నారు. వారికి ఓట్లు పడవని తెలిసి గ్రామాల్లో కుట్రలు, కుతంత్రాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని, రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించేందుకు కృషిచేయాలన్నారు.