పంజాబ్‌ కథ కంచికే¸ ముగిసింది.

– ముంబయిపై గెలిచినా ఫలితం శూన్యం ప్లే ఆఫ్‌కు చేరకుండానే ఇంటికి

– చుక్కలు చూపిన అజార్‌ మహ్మద్‌

హిమాచల్‌ :

ధర్మశాలలో శనివారం జరిగిన ఐపీఎల్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 183 పరుగులు చేసింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ గిల్‌క్రిస్ట్‌ 7 బంతులు ఆడి 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మనిదీప్‌ సింగ్‌ 5 బంతులు ఆడి 1 పరుగు మాత్రమే చేసి ధావన్‌ బౌలింగ్‌లో పొలార్డ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన అజార్‌ మహ్మద్‌ చెలరేగి ఆడాడు. 44 బంతుల్లో 80 పరుగులు (8 ఫోర్లు, 4 సిక్స్‌లు) చేశాడు. మలింగ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మార్ష్‌ కూడా చక్కని బ్యాటింగ్‌తో 47 బంతుల్లో 63 పరుగులు చేశాడు. మిల్లర్‌ 6, వోహ్రా 20 (నాటౌట్‌),  చావ్లా 1 పరుగు చేయగా గురుకీరత్‌ సింగ్‌, కుమార్‌ డకౌట్‌ అయ్యారు. 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి జట్టు 133 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ మాక్స్‌వెల్‌ అభిమానులను నిరాశపరిచాడు. మూడు బంతులు ఆడి ఎలాంటి పరుగులు చేయకుండానే కుమార్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔటయ్యాడు. టారే 12 బంతుల్లో 22 పరుగులు చేసి శర్మ బౌలింగ్‌లో వికెట్‌ పోగొట్టుకున్నాడు. అంబటి రాయుడు 26, శర్మ 25, పొలార్డ్‌ 22, ధావన్‌14, హర్భజన్‌ సింగ్‌ 5, కల్టర్‌ నేల్‌ 9, మలింగ 1 పరుగు చేశారు. కార్తీక్‌ డకౌట్‌ అయ్యారు. పంజాబ్‌ బౌలర్లలో మహ్మద్‌, సందీప్‌శర్మ, చావ్లా రెండేసి వికెట్లు తీయగా, ప్రవీణ్‌కుమార్‌, ఆవానా, గిల్‌ క్రిస్ట్‌లకు ఒక్కో వికెట్‌ దక్కింది. మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌ ఎనిమిది మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించి ప్లే ఆఫ్‌కు అర్హత సాధించలేక పోయింది. దీంతో లీగ్‌ దశలోనే పంజాబ్‌ కథ ముగిసింది.