పంజాబ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఉగ్ర పంజా.. రంగంలోకి ఎన్.ఎస్.జి

w0puxea3పంజాబ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఉగ్రవాదులు పంజా విసిరారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు సోమవారం ఉదయం ఇరు రాష్ట్రాల్లో మెరుపుదాడికి దిగారు. ఈ దాడిలో మొత్తం 8 మంది పోలీసులు మృత్యువాతపడ్డారు. వీరిలో పంజాబ్‌లో ఇద్దరు, ఛత్తీస్‌గఢ్‌లో ఆరుగురు ఉన్నారు. 

కొద్దిసేపటి క్రితం ఈ రెండు సంఘటనలు చోటుచేసుకున్నాయి. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పంజాబ్‌, గురుదాస్ పూర్ జిల్లా దీనా నగర్ పోలీస్ స్టేషన్‌పై విరుచుకుపడ్డారు. తొలుత అటుగా వెళుతున్న ఓ బస్సుపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు, ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లోకి చొరబడిన తమ చేతుల్లో ఉన్న తుపాకులతో అక్కడ పేట్రేగిపోయారు. 
ఈ హఠాత్పరిణామంతో క్షణాల్లోనే తేరుకున్న పోలీసులు కూడా ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల మెరుపు దాడిలో ఓ పోలీస్ కానిస్టేబుల్‌తో పాటు మరో పౌరుడు చనిపోయాడు. ఏడుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్దారు. క్షతగాత్రులను పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదుల మెరుపు దాడితో అక్కడ తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.
అలాగే, ఛత్తీస్‌గఢ్‌లోనూ ‘ఉగ్ర’ పంజాకు ఆరుగురు పోలీసులు మృత్యువాతపడ్డారు. పంజాబ్‌లో దాడి జరిగిన సమయంలోనే ఛత్తీస్‌గఢ్‌లోనూ ఉగ్రవాదులు పెట్రేగిపోవడం గమనార్హం. రాష్ట్రంలోని పత్రంగిపూర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ అధికారుల నివాస సముదాయంపై దాడికి దిగిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. 
ఈ కాల్పుల్లో ఆరుగురు పోలీసులు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం. కాల్పులతో సరిపెట్టని ఉగ్రవాదులు పోలీసు అధికారుల కుటుంబ సభ్యులను బందీలుగా పట్టుకున్నట్టు సమాచారం. దీంతో ఎన్.ఎస్.జి బలగాలు రంగంలోగి దిగాయి.