పండుగున్నది.. పైలం

– కరోనా విస్తరించే అవకాశం

– జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం

దిల్లీ,అక్టోబరు 20(జనంసాక్షి): కరోనాతో భారత్‌ పోరాటం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు చాలా బాగుందని తెలిపారు. మరణాల రేటు తక్కువగా ఉందని పేర్కొన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. కరోనా కట్టడే లక్ష్యంగా విధించిన జనతా కర్ఫ్యూ నుంచి ఇప్పటివరకు ఆయన జాతినుద్దేశించి చేసిన ప్రసంగాల్లో ఇది ఏడోది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కరోనా టెస్టింగ్‌ కోసం 2వేల ల్యాబ్‌లు పనిచేస్తున్నాయని మోదీ చెప్పారు. భారత్‌లో ప్రతి 10లక్షల మందిలో ఐదున్నర వేల మందికే కరోనా సోకిందన్నారు. అదే అమెరికా, బ్రెజిల్‌ లాంటి దేశాల్లో అయితే 10 లక్షల మందిలో 25వేల మందికి సోకిందని పేర్కొన్నారు.

ఆ భావన రానీయకండి

పండుగల సీజన్‌ సవిూపిస్తున్న వేళ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మోదీ కీలక సూచనలు చేశారు. ”త్వరలోనే కరోనా పరీక్షల సంఖ్య 10 కోట్లు దాటిపోతుంది. పరీక్షల సంఖ్య పెంచడంలో వైద్య వ్యవస్థ అత్యంత వేగంగా పనిచేసింది. వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది సేవాభావంతో పనిచేశారు. కరోనా తగ్గుముఖం పట్టిందని నిర్లక్ష్యంగా ఉండొద్దు. కరోనా దేశం నుంచి విడిచిపోయిందనే భావన రానీయొద్దు. కరోనా తగ్గిందని భావిస్తే తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. కరోనా పోయిందని మాస్కులు ధరించకపోతే ప్రమాదంలో పడినట్టే. యూరప్‌, అమెరికా పరిణామాలు చూస్తే నిర్లక్ష్యం కూడా ప్రమాదకరంగా మారొచ్చు” అని అన్నారు.

వ్యాక్సిన్‌ చివరి వ్యక్తికి చేరేదాకా కృషి

‘ప్రపంచమంతా వ్యాక్సిన్‌ కోసం యుద్ధప్రాతిపదికన పనిచేస్తోంది. శాస్త్రవేత్తలు రేయింబవళ్లు పనిచేస్తున్నారు. కొన్ని వ్యాక్సిన్లు రెండో దశలో, మరికొన్ని మూడో దశ ప్రయోగాల్లో ఉన్నాయి. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాక చివరి వ్యక్తికి చేరేవరకు ప్రభుత్వం కృషిచేస్తుంది’ అని అన్నారు.

ఆ మూడింటిని తక్కువగా చూడొద్దు

‘అగ్నిని, శత్రువును, వ్యాధిని తక్కువచేసి చూడొద్దు. వ్యాధికి మందు లభించేవరకు నిర్లక్ష్యం చేయొద్దు. పండుగల సమయం వచ్చేస్తోంది. ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మన జీవితాలు ప్రమాదంలో పడతాయి. విూరు చేసే నిర్లక్ష్యం కుటుంబం మొత్తాన్ని ప్రమాదంలోకి నెడుతుంది. చేలో పంట ఉన్నప్పడు ఆనందపడొద్దు.. అది ఇంటికి చేరాకే సంతోషం. పండుగ ఆనందం ఎప్పటికీ ఉండాలంటే ఇప్పుడు మరింత జాగ్రత్త పడాలి. కరోనా కట్టడి కోసం ఆరడుగుల దూరం, మాస్కు ధరించడం తప్పనిసరి” అని ప్రధాని మోదీ సూచించారు.

సంపన్న దేశాలూ మూల్యం చెల్లించాయ్‌..

‘నిర్లక్ష్యానికి సంపన్న దేశాలు కూడా మూల్యం చెల్లించాయి. మన జాగ్రత్తలు, సంప్రదాయాలే ఈ మహమ్మారి ప్రభావం తగ్గించాయి. కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చేదాకా మరింత జాగ్రత్తగా ఉందాం. కరోనా కట్టడికి కంకణబద్ధులై ప్రజలంతా ముందడుగు వేయాలి. నవరాత్రులు, దసరా, దీపావళి వేళ అందరం అప్రమత్తమై ముందుకు సాగాలి. దేశ ప్రజలకు దసరా, దీపావళి శుభాకాంక్షలు” అని మోదీ తెలిపారు.