పంద్రాగస్టుకు ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..!
హైదరాబాద్, ఆగస్టు 14 (జనంసాక్షి):సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో అట్టహాసంగా నిర్వహించనున్న స్వాతంత్య్రదినోత్సవ వేడుకల సందర్భంగా నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని కమిషనర్ అనురాగ్ శర్మ వెల్లడించారు. ఉదయం 7గంటల నుంచి 11 గంటల వరకు ఎస్‌పిరోడ్ -సిటిఓ క్రాస్ రోడ్, వైఎంసిఏ క్రాస్‌రోడ్‌ల మధ్య వన్‌వే ఉంటుందని, కంటోన్మెంట్ గార్డెన్ నుంచి ఎస్‌బిహెచ్ క్రాస్‌రోడ్స్ మధ్య మార్గంలో వాహనాలను అనుమతించబోమన్నారు. పాసులున్నవారిని సిటిఓ జంక్షన్ నుంచి వైఎంసిఏ వరకు అనుమతిస్తామని ఆయన తెలిపారు.
ఏఏ, ఏ-1, బి-1 కారు పాసులున్న వారు బేగంపేట నుంచి వస్తున్నట్లైతే రసూల్‌పురా జంక్షన్ మీదుగా సిటిఓ ఫ్లైవర్‌వైపు, అప్పర్ ట్యాంక్‌బండ్, రాణిగంజ్ నుంచి వచ్చేవారు ఎంజిరోడ్/పార్క్‌లేన్‌ల మీదుగా పెరేడ్ గ్రౌండ్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. కంటోన్మెంట్ నుంచి సికింద్రాబాద్ క్లబ్, టివోలి, ప్లాజా క్రాస్‌రోడ్స్‌ల మీదుగా వచ్చేవారు లెఫ్ట్ టర్న్ తీసుకుని వారికి కేటాయించిన పార్కింగ్ స్లాట్‌ల్లో వాహనాలను నిలపాలి.
ఏఏ కారు పాసులున్నవారు తమ వాహనాలను విఐపి పార్కింగ్ ఏరియాలో, ఏ-1 పాసులున్నవారు జిహెచ్ ఎంసి కార్యాలయం ఎదురుగా, ఏ-2పాసులున్నవారు చీఫ్ ఇంజనీర్ అర్డినెన్స్ ఫ్యాక్టరీ కార్యాలయ ప్రాంగణంలో, డ్యూటీకారు పాసులున్నవారు జింఖానా మైదానంలో తమ వాహనాలను పార్కింగ్ చేసుకునే ఏర్పాట్లు చేశారు.
పాసులు లేని వాహనాలను ఎస్‌బిహెచ్ మీదుగా వైఎంసిఏ జంక్షన్, సెయింట్ ఆన్స్ పాఠశాల వైపు మళ్ళిస్తారు. ద్విచక్రవాహనాలకు ఆర్‌జిఆర్ సిద్ధాంతి కళాశాల లేన్‌లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. పెరేడ్ గ్రౌండ్స్ వేడుకలు ముగిసిన తర్వాత అధికారులు సూచించిన మార్గాల్లోనే వాహనాలు వెళ్ళాల్సి ఉంటుంది. ఉదయం 8.50 తర్వాత వచ్చే ఏఏ, ఏ1, బి1 పాస్ హోల్డర్లు తమ వాహనాలను చిల్లా దర్గా వద్ద మళ్ళించుకుని స్విమ్మింగ్ పూల్ వైపు వెళ్ళాల్సి ఉంటుంది.