పట్టణాలు పల్లెల అభివృద్దే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం – మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ “

శేరిలింగంప‌ల్లి, జూన్ 06( జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాలు, పల్లెలు అన్నింటిలోనూ పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి రాష్ట్ర సమగ్రాభివృద్దే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో ప్రభుత్వ యంత్రాంగం ముందుకు సాగుతోందని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. ఈమేరకు డివిజన్ పరిధి దత్త సాయి నగర్ కాలనీలో ఏర్పాటుచేసిన పట్టణప్రగతి ఈ కార్యక్రమానికి జలమండలి, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరాస ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎనలేని అభివృద్ధి జరిగిందని, ఏడేళ్ళ పరిపాలనలోనే రాష్ట్రాన్ని అర్థశతాబ్దం ముందుకు తీసుకెళ్ళిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు దక్కుతుందన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని పరిశుభ్రతతోపాటు స్వచ్ఛ తెలంగాణగా మార్చాలన్న దృఢసంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ముఖ్యమంత్రి, పురపాలక శాఖ మంత్రి పిలుపుమేరకు శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ విప్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే మురికిపూడి గాంధీ ఆధ్వర్యంలో ప్రతి కాలనీ, వీధి, బస్తీలలో యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపడుతూ అధికారులు ముందుకు సాగుతుండడం శుభపరిణామమన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందువరుసలో నిలబెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల ద్వారా భారతదేశాన్ని సైతం ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు, దత్త సాయి నగర్ కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.