పత్తి చేలను పీకేసిన దుండుగుల

లక్షల్లో నష్టపోయిన రైతులు

దర్యాప్తుచేపట్టిన పోలీసులు

జోగులాంబగద్వాల,జూలై27(): దుండుగులు కొందరు పచ్చని పత్తిపంటను సర్వనాశనం చేశారు. గద్వాల మండలం ఈడిగోనిపల్లిలో కొంతమంది దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఐదుగురు రైతులకు చెందిన పత్తి చేనును దుండగులు పీకివేశారు. ఐదు ఎకరాల విస్తీర్ణంలో పత్తి మొక్కలను వేసినట్లు బాధిత రైతులు తెలిపారు. ఈ మొత్తం మొక్కలను పీకేసినట్లు రైతులు చెప్పారు. దీంతో ఒక్కో రైతుకు రూ. 2 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిలినట్లు రైతులు పేర్కొన్నారు. బాధిత రైతుల కథనం మేరకు… గ్రామంలో సీడ్‌ పత్తి పంటను హనుమంతు, పెద్దపోగులు, చిన్నపోగులు, పోల నరసింహులు, దేవర లొడ్డన్నలు లక్షలు వెచ్చించి సాగు చేస్తున్నారు. గురువారం అర్థరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వారి పంట మొత్తాన్ని ధ్వంసం చేశారు. విషయంపై బాధిత రైతులు గద్వాల గ్రావిూణ ఠానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ వెంకటేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. దుండగుల దుశ్చర్యతో బాధిత రైతులు కన్నీరుమున్నీరు అయ్యారు. బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

——-