పథకాల అమలులో ఆదేశాలు బేఖాతరు
ఎన్నికల కాలం కావడంతో పట్టించుకోని వైనం
రాజన్న సిరిసిల్ల,అక్టోబర్31(జనంసాక్షి): రాజన్నసిరిసిల్ల జిల్లాలో కార్మికులు, వలసలతో పేదరికంతో సతమతమవుతున్న వారే అధికంగా ఉంటారు. మంత్రి కెటిఆర్ పదేపదే హెచ్చరిస్తున్నా, ఆదేశాలు ఇస్తున్నా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో
ప్రవేశపెట్టిన పలు పథకాలు ప్రజలకు చేరువకావడంలో తీవ్రజాప్యం జరుగుతోంది. కొత్తరుణాలకోసం దరఖాస్తు చేసుకున్నా జాప్యం జరుగుతోంది. అన్నదాతలకు అధికారుల చేయూత కరవైంది. అనేకరకాల పథకాలు అమలుచేస్తున్నా జిల్లా రైతులకు అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. మెట్టప్రాంతమైన జిల్లాలో సాగునీటి కొరతను అధిగమించేందుకు రైతులకు బిందు, తుంపర సేద్యం పరికరాలను అందించేందుకు నిధులు కేటాయించారు. లబ్దిదారుల ఎంపిక పరికరాల పంపిణీలో జాప్యం జరుగుతుండటంతో నేటికీ దరఖాస్తు చేసుకున్న రైతులకు పరికరాలు అందలేదు. వ్యవసాయ, దాని అనుబంధశాఖల ద్వారా రైతులకు అందాల్సిన రాయితీలు అందడంలో తీవ్రజాప్యం జరుగుతోంది.రహదారులు భవనాలశాఖ పరిధిలోనూ పనుల్లో తీవ్రజాప్యం జరుగుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్‌కాకతీయ పనులు జిల్లాలో పురోగతి అంతగా కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి.వీటితోపాటు వయోజనవిద్య, గిరిజనసంక్షేమశాఖ, దేవాదాయ శాఖ, పర్యాటకం, కార్మికశాఖలు విభజనకు నోచుకోకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా కొనసాగుతోంది.