పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్-2 ఫలితాలు రద్దు
` తెలంగాణ హైకోర్టు ఆద్ఱేశం
హైదరాబాద్(జనంసాక్షి):పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఎంపిక జాబితాను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. 2015- 16లో నిర్వహించిన గ్రూప్-2లో ఎంపికైన వారి జాబితాను రద్దు చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. హైకోర్టు ఆదేశాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించిందని, పరిధిదాటి వ్యవహరించిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పునర్ మూల్యాంకనం చేసి అర్హుల జాబితా నిర్ణయించాలని, ఈ ప్రక్రియ 8 వారాల్లో ముగించాలని హైకోర్టు ఆదేశించింది.వైట్నర్, దిద్దుబాటు ఉన్న జవాబుపత్రాల మూల్యాంకనంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ట్యాంపరింగ్ జరిగినట్లు తెలిసినా.. మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది. సాంకేతిక కమిటీ సూచన ప్రకారం పునర్‌మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. 2015లో టీజీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది. 2016 నవంబర్‌లో రాతపరీక్షలు నిర్వహించింది. 2019లో గ్రూప్-2 నియామకాలు చేపట్టింది. దీనిపై పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ నగేశ్ భీమపాక తీర్పు వెలువరించారు.



