పరకాలలో గూండారాజ్యం పోవాలి
పరకాలలో కొండా దంపతుల గూండాగిరి పోవడానికి సమయం దగ్గర పడిందని టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. పరకాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఆయన హాజరై ప్రసంగించారు. ఇంతకాలం పరకాలలో యథేచ్ఛగా సాగించిన ‘కొండా’గిరి పోవాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి భిక్షపతిని గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కొండా మురళి దుర్యోధనుడిలా మాట్లాడుతున్నాడని, కొండా దంపతుల ఆగడాలు పరకాల ప్రజలకు తెలుసన్నారు. అందుకే వారి దుష్ట పాలనకు తెరదించే అవకాశం ఉప ఎన్నిక రూపంలో వచ్చిందని, పరకాల ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బీజేపీని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ ఆ పార్టీకి తెలంగాణ రావాలని లేదని, తెలంగాణ పేరు చెప్పుకుని రాజకీయంగా బతుకడమే ముఖ్యమని విమర్శించారు. జాతీయ పార్టీలతోనే తెలంగాణ వస్తదంటున్న బీజేపీ నాయకులు, అసలు జాతీయ పార్టీలు ఎక్కడున్నాయో తెలుపాలన్నారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల మద్దతు ఏ పార్టీ అధికారంలోకి రాలేదని, ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వాల కాలం నడుస్తున్నదని బీజేపీ నాయకులు తెలుసుకోవాలన్నారు. మిగతా ఉప ఎన్నికల స్థానాలను వదిలేసి, కేవలం పరకాలలోనే బీజేపీ ఎందుకు ప్రచారం చేస్తున్నదని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇక్కడే మైకు పట్టుకుని ఎందుకు తిరుగుతున్నాడో చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. బీజేపీ వైఖరి చూస్తుంటే జగన్ పార్టీతో లోపాయికారి ఒప్పందం ఏదో కుదుర్చుకున్నట్లు ఉందని ఆరోపించారు. పార్లమెంట్లో ఎంపీలను సస్పెండ్ చేసినప్పుడు, బీజేపీ ఎందుకు నోరు మెదపలేదో స్పష్టం చేయాలన్నారు. సీమాంధ్ర పార్టీల డిపాజిట్లను గల్లంతు చేసేలా, కారు గుర్తుకు ఓట్లేసి టీఆర్ఎస్ అభ్యర్థి భిక్షపతిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తన ప్రచారంలో తమను గెలిపిస్తే మళ్లీ వైఎస్సార్ పాలనను అందిస్తామని చెబుతున్నారని, మళ్లీ వైఎస్ పాలన ఎందుకు ? తెలంగాణను ఇంకోసారి ముంచడానికా అని ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో తెలంగాణలోని ఉక్కు, తుక్కు, బొగ్గు, నిధులు, నీళ్లు, ఉద్యోగాలు దోచుకుని, సీమాంధ్రులకు కట్టబెట్టాడని కేసీఆర్ ఆరోపించారు. ఒక్క జగన్ జైలుకెళ్లేనే విజయమ్మ కారుస్తున్నదని, ప్రత్యేక ఆకాంక్ష కోసం చనిపోయిన ఎనిమిది వందల మంది తెలంగాణ బిడ్డల తల్లులు ఎంతగా బాధపడుతున్నారో విజయమ్మకు తెలియదా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే రెండేళ్లలో పోలవరం నిర్మిస్తామని విజయమ్మ అంటున్నదని, అంటే, గోదావరి నీళ్లను సీమాంధ్రకు తరలించి తెలంగాణను ఎండబెడతామని విజయమ్మ చెప్పకనే చెబుతున్నదని ఆయన మండిపడ్డారు. వైఎస్సార్ తన కూతురు, అల్లుడు, కొడుకుకు మొత్తం రాష్ట్రాన్నే రాసిచ్చాడని, వాళ్లు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని కేసీఆర్ ఆరోపించారు. అటువంటి జగన్ పార్టీకి ఓటేస్తే తెలంగాణలో సమైక్యవాదులకు జెండాలు పాతడానికి అవకాశమిచ్చినట్టేనని వివరించారు. పరకాల ఉప ఎన్నిక తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నిలిచిపోనున్నదని, సమైక్యవాదులకు బుద్ధి చేప్పేలా టీఆర్ఎస్ అభ్యర్థి భిక్షపతినే గెలిపించాలని కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ సభలో టీఆర్ఎస్ఎల్పీ నాయకుడు ఈటెల రాజేందర్, ఉప నాయకుడు హరీశ్‌రావు, పార్టీ ఎమ్మెల్యేలు, వివిధ జిల్లా నుంచి తరలివచ్చిన నాయకులు పాల్గొన్నారు. సభలో కేసీఆర్ ప్రసంగం ప్రారంభిస్తుండగానే చిరుజల్లులు కురవడం మొదలయ్యాయి. అయినా, ప్రజలు వర్షాన్ని లెక్క చేయక సభ ముగిసే వరకు ఉండడం గమనార్హం.