పరిశ్రమలకు కరెంటు కోతలేదు

3

– తెలంగాణలో పెట్టుబడి పెట్టండి

– మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,ఆగస్టు 24(జనంసాక్షి): తెలంగాణ పారిశ్రామిక విధానం వల్ల ప్రతి ఒక్కరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్‌ఆనరని, ఎక్కడా ఇలాంటి పాలసీ లేదని ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ రెండేళ్లలో ప్రగతిశీలంగా వ్యవహరించి ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ప్రధానంగా పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు లేకుండా చేశామని అన్నారు.  ఐటీసీ కాకతీయలో సీఐఐ ఆధ్వర్యంలో లీడర్‌షిప్‌ సిరీస్‌ ఆన్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ ఎక్సలెన్స్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ లీడర్‌షిప్‌ సిరీస్‌ ఆన్‌ మ్యానిఫాక్చరింగ్‌ రిపోర్టును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘కొన్నాళ్లుగా సీఐఐ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తోంది. ఉత్పత్తి రంగంలో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తున్నాం. దేశంలోనే ఈ రంగంలో ముందున్నాం. ఉత్పత్తి రంగంలో సాధిస్తున్న ప్రగతితో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని వివరించారు. పరిశ్రమలకు విద్యుత్‌ కోసం గతంలో ధర్నాలు జరిగేవి, ఆందోలనలుచేసే వారు. వారంతపు సెలవులు ప్రకటించేవారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే ఈ పరిస్థితికి చరమగీతం పాడినట్లు వెల్లడించారు.  తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం. దేశంలోనే అత్యుత్తమైన ఇండస్ట్రియల్‌ పాలసీని అమలు చేస్తున్నాం. టీఎస్‌ఐపాస్‌తో తెలంగాణలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో పెద్ద సంస్థలు ముందుకొచ్చాయి. యావత్‌ ప్రపంచం తెలంగాణ వైపే చూస్తోందని వివరించారు.  టీఎస్‌ ఐపాస్‌ ద్వారా కేవలం 15 రోజుల్లోనే అనుమతిలిస్తున్నాం. ఈ విధానాన్ని అమలు చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. ఇంటింటికీ సురక్షిత మంచి నీళ్లు ఇచ్చేందుకే మిషన్‌ భగీరథ ప్రాజెక్టు చేపట్టామని తెలిపారు. పారిశ్రామిక ప్రగతి కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు.