పరిషత్ ఎన్నికల్లో సత్తాచాటుదాం
– ప్రజలంతా తెరాసవైపే ఉన్నారు
– ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించండి
– ఎన్నికల ప్రచారంలో మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, మే3(జనంసాక్షి) : జిల్లాలో మూడు విడతల్లో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల గెలుపును ప్రతి కార్యకర్త కృషి చేయాలని, తద్వారా పరిషత్ ఎన్నికల్లో మరోసారి తెరాస సత్తాను చాటుదామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం
జిల్లాలోని పలు మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మంత్రి ఈ సందర్భంగా ఓటర్లను కోరారు. గోపాల్‌పేట్ మండలం తిరుమలాపురం, చెన్నూరు, ఖిల్లా ఘణపురం మండలం పర్వతాపురం మామిడిమాడ గ్రామంలో జరిగిన టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరిషత్ బరిలో నిలిచిన టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయం కోసం ప్రజలు కలిసి రావాలని
పిలుపునిచ్చారు. గత ఐదేళ్లు కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ది కార్యక్రమాలు మరింత మెరుగైన వసతులను ప్రతి గడపకు చేరాలంటే టీఆర్‌ఎస్ ఎంపీటీసీ. జడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం సహకారంతోనే నియోజకవర్గంలోని ప్రతి పల్లెకు సాగునీరు తీసుకువచ్చామని మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు పేరుకు మాత్రమే సంక్షేమ కార్యక్రమాలు చేసేవనీ, తెలంగాణ ప్రభుత్వం గడపగడపకూ ప్రతి సంక్షేమ పథకం చేరేలా కృషి చేస్తుందన్నారు. ఈ నెల 6న జరుగునున్న ఎన్నికల్లో ఎంపీటసీ, జడ్పీటీసీ స్థానాలకు బరిలో నిలిచిన టీఆర్‌ఎస్ అభ్యర్థుల కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని, అలాగే దేశం కూడా వ్యవసాయా ఆధారితమేనని అన్నారు. గ్రామాలు పాడి పంటలతో ఉంటేనే దేశం మొత్తం సుభిక్షంగా ఉంటుందన్నారు.పిల్లలను పెంచి పోషించినట్టు పశువులను మచ్చిక చేసుకొని పెంచినట్టు అయితే రైతులకు పశువులు అన్ని విధాల సహకారంగా ఉంటుందన్నారు. ఇంట్లో పాడి ఉంటే లక్ష్మి దేవి ఇంట్లో ఉన్నట్టే అని అన్నారు. రైతులు పాత తరం మాదిరి కాకుండా ఆదునీకరణ,సాంకేతికతను అబివృద్ది చేసుకుని పంటలు పండించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నేతలు పాల్గొన్నారు.