పల్లెపల్లెకు తెలుగుదేశం : టీడీఎల్పీ నిర్ణయం
నిజామాబాద్ : పల్లెపల్లెకు తెలుగుదేశం పేరిట మరో 10 నుంచి 15 రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం (టీడీఎల్పీ) సోమవారం తీర్మాణం చేసింద. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ‘ వస్తున్నా… మీకోసం ‘ పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తయిన నేపథ్యంలో జిల్లాలోని పాలంపాడు వద్ద 41 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలతో టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమంపై చర్చ జరిగిందని పార్టీ ఎమ్మెల్యేలు మోత్కుపల్లి నర్సింహులు,ధూళిపాళ నరేంద్ర, గాలి ముద్దుకృష్ణమనాయుడు విలేకరులకు తెలిపారు. నీలం తుపాను బాధిత రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వారు మండిపడ్డారు. కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్పీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం, మద్దతు తీసుకునే విషయమై రెండు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్స్ జరిగిందని టీడీపీ నేతలు ఆరోపించారు.కేవలం ముఖ్యమంత్రి పదవి కోసమే జగన్ కాంగ్రెస్‌ను వీడారని ముద్దుకృష్ణమ నాయుడు పేర్కొన్నారు. ఇక మాదిగ ఉపకులాలను కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని మోత్కుపల్లి దుయ్యబట్టారు. శాసనసభ సమావేశాల్లో ఈ విషయం స్పష్టమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖర్‌రావును నమ్ముకుంటే ప్రత్యేక రాష్ట్రం రానేరాదని నిప్పులు చెరిగారు.