పల్లెలకు దూరమవుతున్న పల్లె వెలుగు బస్సులు…

– చదువులకు దూరమవుతున్న విద్యార్థులు
– పల్లెలకు బస్ సర్వీసులు కొనసాగించాలని విద్యార్థుల వేడుకోలు
గద్వాల రూరల్ జులై ‌04 (జనంసాక్షి):-    జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు గ్రామాలకు టీఎస్ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులు వెళ్లడం లేదు. ప్రతిరోజు జిల్లా కేంద్రానికి చదువుల నిమిత్తం వచ్చే విద్యార్థిని, విద్యార్థులు బస్సు సర్వీసులు లేక తప్పని పరిస్థితులలో చదువులు మానేయాల్సి వస్తుంది. విద్యార్థులు చదువులు మానేసి పంట పొలాలకు రోజువారి కూలీలుగా వెళ్తున్నారు. మా గ్రామాలకు పాఠశాల సమయానికి బస్సు సర్వీసులు కొనసాగితే మేము మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకుంటామని విద్యార్థులు చెబుతున్నారు. ఇటీవల ఆర్టీసీ బస్సు పాసులు, టికెట్ రేట్లు పెంచిన విషయం తెలిసిందే. గద్వాల, రాజోలి,ధరూరు, గట్టు మల్దకల్ , ఐజ, కేటి దొడ్డి, ఇటిక్యాల తదితర మండలాలలోని పలు గ్రామాలకు బస్సు సర్వీసులు లేక ఇటు విద్యార్థులు, అటు ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే అదునుగా చేసుకొని ప్రైవేటు వాహనదారులు ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేస్తున్నట్లు వారు వాపోతున్నారు. ఇప్పటికైనా గద్వాల ఆర్టీసీ డిపో మేనేజర్ స్పందించి ఆయా గ్రామాలకు పాఠశాల సమయంలో బస్సు సర్వీస్ లు నడపాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రయాణికులు కోరుతున్నారు…