పశువుకలు మందులు అందుబాటులో ఉంచాలి
మంత్రి శ్రీనివాసయాదవ్
హైదరాబాద్,జూలై26(జనంసాక్షి): రాష్ట్రంలోని అన్ని పశువైద్య శాలల్లో జీవాలకు అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మత్స్య భవన్ నుంచి అన్ని జిల్లాల పశువైద్యాదికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గొర్రెల పంపిణీలో అర్హులైన
లబ్దిదారులు అందరు 10 రోజులలో డీడీలు చెల్లించే విధంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మొదటి విడతలో 554 పశువైద్యశాలలను అభివృద్ధి చేశాం. అవసరమైన ప్రాంతాలలో నూతన పశువైద్య శాలల నిర్మాణం చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ పశుసంవర్ధక శాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో మరణించిన జీవాలకు విపత్తుల నిర్వహణ శాఖ నుంచి పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. గొర్రెల పెంపకం దారులకు మేలు చేసే విధంగా అన్ని సౌకర్యాలతో గొర్రెల మార్కెట్ ల ఏర్పాటు చేస్తామని మంత్రి తలసాని తెలిపారు.