పసుపుబోర్డుపై కానరాని కదలిక
అటకెక్కిన ఎంపి అర్వింద్ హావిూ
ధరల కోసం పసుపు రైతుల ఆందోళన
నిజామాబాద్,డిసెంబర్4(జనంసాక్షి): పసుపు రైతుల సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ప్రభుత్వం పసుపు కొనుగోలు చేస్తేనే రైతులు గట్టేక్కే అవకాశముంది. పసుపు బోర్డుపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. శాశ్వత పరిష్కారం కోసం పార్లమెంట్ ఎన్నికల్లో 178మంది రైతులు నామినేషన్లు వేశారు. వెంటనే పసుపుబోర్డు సాధిస్తానని ఎంపీ ధర్మపురి అర్వింద్ హావిూ కూడా ఇచ్చినా.. ఇప్పటి వరకు అది అమలు కాలేదు.. దీంతో ఈ సీజన్ లో ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయిస్తే పసుపు రైతులకు మేలు జరుగుతుంది. గతంలో ఒక సారి రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. పసుపుబోర్డు, మద్దతు ధర కోసం కృషి చేయడంలోపాటు ఎంఐఎస్ కిం ద తమకు సాయం చేయచడానికి చర్యలు తీసు కోవాలని ఎంపీని రైతులు కోరుతున్నారు. గత సంవత్సరం క్వింటా లుకు రూ.15వేలు చెల్లించి కొనుగోలు చేయాలని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఎర్రజొన్నతో పాటు పసుపు కూడా కొనుగోలు చేయాలని జాతీయరహదారులను దిగ్భంధించారు. ఆర్మూర్ డివిజన్‌లో 30నుంచి 35వేల ఎకరాల్లో పసుపు సాగు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఈ ప్రాంతంలోనే సాగులో ఉంది. మిగతా పంటలతో పోలిస్తే పసుపులో లాభాలు రావడంలేదు. తరతరాలుగా సాగు చేస్తున్నందున ఇప్పటి రైతులు కూడా పంటను కొనసాగిస్తున్నారు. నానాటికి పెట్టుబడులు పెరిగిపోతున్నా ఆదాయం మాత్రం రావడంలేదు. పంట సాగుకు ఎకరాకు లక్ష రూపాయల వరకు పెట్టుబడి అవుతోంది. కొంత మంది రైతులకు పెట్టుబడికే సరిపోతుండగా, మరికొందరికి పెట్టుబడులు కూడా దక్కడంలేదు. ఈ సారి పెట్టుబడులు దక్కే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు. అధిక వర్షాలతో తెగుళ్లు కూడా ఎక్కువయ్యాయి. దీంతో దిగు బడి విూద ప్రభావం చూపే అవకాశముంది. పసుపు సగటు దిగుబడి 20 నుంచి 25 క్వింటా ళ్లు. ఈ సారి 20క్వింటాళ్లు దాటే అవకాశంలేదు. మరోవైపు పసుపు ధర పెరగకపోవడం రైతులను ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా పసుపు సీజన్‌లో ధర అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ, అన్ సీజన్‌లో పెరిగేది. జనవరి, ఫిబ్రవరిలో స్వల్పకాలిక రకాలు చేతికి రాగా, ఫిబ్రవరి, మార్చి నుంచి దీర్ఘకాలిక రకాలు చేతికి వస్తా యి. పసుపునకు మద్దతు ధర లే నందున సీజన్‌లో అమాంతం పడిపోతుంది.