పాక్‌ను మరిపిస్తున్నారు

– దేశంలో భయానక వాతావరణం నెలకొంది
– అన్ని సంస్థల్లోనూ ఆర్‌ఎస్‌ఎస్‌ జోక్యం పెరిగింది
– ఇలాంటి పరిస్థితి పాకిస్థాన్‌, నియంతృత్వ కిందనున్న దేశాల్లోనే జరుగుతుంది
– కర్ణాటక పరిణామంతో భారత రాజ్యాంగంపై దాడి జరిగింది
– ఎమ్మెల్యేలంతా ఒకవైపు ఉంటే.. గవర్నర్‌ మరోవైపు నిలబడ్డాడు
– ఛత్తీస్‌గఢ్‌ బహిరంగ సభలో రాహుల్‌ సంచలన వ్యాఖ్యలు..
రాయ్‌పూర్‌, మే17(జ‌నం సాక్షి) : దేశంలో బీజేపీ పాలన విధానం చూస్తుంటే పాకిస్థాన్‌ను తలపిస్తుందని, దేశంలోని ప్రత్య వ్యవస్థలలో ఆర్‌ఎస్‌ఎస్‌ జోక్యం పెరగడంతో దేశంతో భయానక వాతావరణం నెలకొందని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ తొలిసారి ఓ బహిరంగ సభలో మాట్లాడారు. వస్తూ వస్తూనే బీజేపీ, ఆరెస్సెస్‌లపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. దేశంలో భయానక వాతావరణం నెలకొందనీ.. రాజ్యాంగం పెను ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు. దేశంలోని ప్రజాస్వామ్య సంస్థలన్నిటినీ బీజేపీ, ఆరెస్సెస్‌లు చెరపడుతున్నాయని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ఓ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కర్ణాటకలో గత రెండు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆయన స్పందిస్తూ.. దేశంలోని అన్ని సంస్థల్లోనూ జోక్యం చేసుకునేందుకు ఆరెరెస్స్‌ ప్రయత్నిస్తోంది. ఇలాంటి పరిస్థితులు పాకిస్తాన్‌ వంటి దేశాల్లో లేదా నియంతృత్వ కిందనున్న దేశాల్లో మాత్రమే జరుగుతాయి. గురువారం భారత రాజ్యాంగంపై దాడి జరిగింది. కర్ణాటకలో ఓవైపు ఎమ్మెల్యేలు నిలబడితే.. గవర్నర్‌ మరోవైపు నిలబడ్డారు. తమ ఎమ్మెల్యేలకు రూ.100 కోట్ల ఎరచూపారంటూ జేడీఎస్‌ చెబుతోంది. అని రాహుల్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భయాందోళన నెలకొందనీ.. గత 70ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదన్నారు.. ఈ భయాందోళనలు వ్యాప్తి చేస్తున్నది… వాటి నుంచి లబ్ధి పొందుతున్నది ఎవరు? పార్లమెంటులో నేను కొందరు బీజేపీ ఎంపీలను కలుసుకున్నాను. వాళ్లు కూడా సుప్రీంకోర్టు జడ్జిల మాదిరిగా అణిచివేత కింద ఉన్నట్టు కనిపించారు. ప్రధాని ముందు తాము ఒక్క మాట కూడా మాట్లాడలేమని వాళ్లు చెప్పారు. కోర్టులు, విూడియా సహా స్వతంత్ర సంస్థలన్నీ దేశం తరపున గొంతు విప్పాలి. కాని అవన్నీ నియంత్రణకు గురవుతున్నాయి… అని రాహుల్‌ ఆరోపించారు.
——————————–