పాక్‌లో దారుణం

2

– బస్సుపై తాలిబాన్ల కాల్పులు

– 47 మంది మృతి

కరాచీ,మే13(జనంసాక్షి):

పాకిస్థాన్‌లోని కరాచీలో దారుణం జరిగింది. తాలిబన్‌ ఉగ్రవాదులు మరోసారి నరమేథం సృష్టించారు. ఓ బస్సుపై ఉగ్రవాదులు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో 47 మంది ప్రయాణికులు మృతిచెందగా, 20మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 16మంది మహిళలు ఉన్నారు. కరాచీలోని సఫోరా చౌరంగి ప్రాంతంలో ద్విచక్రవాహనాలపై వచ్చిన ఆరుగురు ఉగ్రవాదులు బస్సులోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపి మారణ¬మం సృష్టించారు. ప్రయాణికుల కణతలకు తుపాకీలు గురిపెట్టి అతి సవిూపం నుంచి కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు దాడికి గురైన బస్సు ఇస్మాయిలీ సమాజానికి చెందినదిగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, సహాయ బృందాలు క్షతగాత్రులను సవిూపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆరుగురు సాయుధ ముష్కరులు.. షియా వర్గానికి చెందిన ప్రయాణికులే లక్ష్యంగా  బస్సుకు  అన్ని వైపుల నుంచి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో  47మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తప్పించుకునే మార్గం లేకపోవడంతో కూడా ప్రాణానష్టం ఎక్కువగా ఉండటానికి కారణమయిందని పోలీసులు చెప్పారు. దుర్ఘటన సమయంలో బస్సులో 60 మంది ఉన్నట్లు తెలిసింది. ముష్కరులు కాల్పులు జరిపిన బస్సు.. నగరంలోని అల్‌- అజహర్‌ గార్డెన్‌ కాలనీకి చెందినదిగా గుర్తించారు. అందులో ప్రయాణిస్తోన్న 50 మంది కూడా షియా వర్గానికి చెందినవారేనని పోలీసులు నిర్ధారించారు. ఘటనా స్థలికి చేరుకున్న భద్రతా బలగాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సవిూప ఆసుపత్రికి తరలించారు.  ఈ సంఘటనతో పాకిస్తాన్‌ ప్రభుత్వం హై అలర్ట్‌ ప్రకటించింది. కాల్పులకు పాల్పడింది తామేనంటూ తెహ్రీక్‌- ఏ- తాలిబన్‌ సంస్థ ప్రకటించింది.