వాణిజ్య యుద్ధం మరింత తీవ్రం

` అమెరికాకు కీలక ఎగుమతులు నిలిపేసిన చైనా..!
` అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలు, అయస్కాంతాల సరఫరా బంద్‌
బీజింగ్‌(జనంసాక్షి):అమెరికా` చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైంది. అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలు, అయస్కాంతాలను ఎగుమతి చేయడం బీజింగ్‌ నిలిపివేసింది.దీంతో పశ్చిమ దేశాల్లో ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్స్‌, ఏరోస్పేస్‌ తయారీ, సెమీకండక్టర్లు కంపెనీలకు సమస్యలు ఎదురుకానున్నాయి. ఎగుమతులకు సంబంధించిన నిబంధనలను చైనా రూపొందిస్తోంది. అప్పటి వరకు చైనా పోర్టుల నుంచి మాగ్నెట్‌ల ఎగుమతులను నిలిపివేశారు. ఈ విషయాన్ని న్యూయార్క్‌ టైమ్స్‌ కథనంలో పేర్కొంది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే కొన్ని కంపెనీలకు శాశ్వతంగా వీటి సరఫరా నిలిచిపోనుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మొదలు పెట్టిన వాణిజ్యయుద్ధానికి ప్రతి స్పందనగానే కీలక విడిభాగాల ఎగుమతులను చైనా ఆపేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న అరుదైన ఖనిజాల్లో దాదాపు 90శాతం చైనా నుంచే వెళుతున్నాయి. ఏప్రిల్‌ 2 నుంచి బీజింగ్‌ వీటి ఎగుమతులపై ఆంక్షలు విధించింది. అప్పటికే చైనా ఉత్పత్తులపై 54శాతం టారిఫ్‌లను ట్రంప్‌ విధించారు. వీటిని కాకుండా పర్మినెంట్‌ మాగ్నెట్ల, ఇతర ఉత్పత్తులను కూడా నిలిపేశారు. ఈ లోటును భర్తీ చేసుకోవడం అగ్రరాజ్యానికి ఇబ్బందికరంగా మారనుంది. అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు మరింత ముదిరితే ఇలాంటి చర్యలు చేపడతామని బీజింగ్‌ ఎప్పటి నుంచో హెచ్చరిస్తోంది.చైనా తాజాగా చేపట్టిన చర్యల ప్రభావం కేవలం అమెరికా వరకే పరిమితం కాదు.. అన్ని దేశాలపై ఉండనుంది. కీలక ఖనిజాల మైనింగ్‌, ప్రాసెసింగ్‌లో చైనా తనకున్న శక్తిని ఆయుధంగా వాడుతోంది. దీంతోపాటు ఎక్స్‌పోర్ట్‌ లైసెన్స్‌లను పరిమితం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అమెరికాలోని లాక్‌హీడ్‌మార్టిన్‌, టెస్లా, యాపిల్‌ వంటి సంస్థలు చాలా ముడిపదార్థాల కోసం బీజింగ్‌పైనే ఆధారపడుతున్నాయి. అమెరికా ప్రభుత్వం వద్ద రేర్‌ఎర్త్‌ మినరల్స్‌ నిల్వలు ఇప్పటికే ఉన్నాయి. కానీ, తమ డిఫెన్స్‌ కాంట్రాక్టర్లకు సరఫరా చేయడానికి మాత్రం ఇవి సరిపోవు.

 

సుంకాల యుద్ధంలో విజేతలుండరు
వాణిజ్య విధానాలు కాపాడుకోవాలి: జిన్‌పింగ్‌
బీజింగ్‌(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతీకార సుంకాల చర్యలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఇతర దేశాల సహకారం కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.ఆగ్నేయాసియాలో పర్యటనలో భాగంగా సోమవారం వియత్నాం వెళ్లిన ఆయన వాణిజ్య, సుంకాల యుద్ధంలో విజేతలుండరని వ్యాఖ్యానించారు.ప్రపంచంలోనే భారీగా ఎగుమతులు చేస్తున్న దేశాల సరసన ఉన్న చైనాకు ట్రంప్‌ సుంకాల ప్రభావం అధికంగా ఉంటుంది. తాజాగా ట్రంప్‌ ఫోన్లు, కంప్యూటర్లు వంటి కొన్ని వస్తువులను సుంకాల నుంచి మినహాయించినప్పటికీ, రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాపై సుంకాలు తీవ్ర పరిణామాలను చూపుతాయని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. యూఎస్‌ చైనాపై 145% సుంకాలను అమలు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో చైనా కూడా వెనక్కి తగ్గకుండా యూఎస్‌పై 125 శాతం సుంకాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆగ్నేయాసియాలోని వియత్నాంలో షీ జిన్‌పింగ్‌ పర్యటన ఆసక్తికరంగా మారింది. వియత్నాంపై కూడా యూఎస్‌ అధిక సుంకాలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. ‘ట్రంప్‌ నేతృత్వంలోని అమెరికా ప్రపంచంపై అమలు చేస్తున్న విధానానికి విరుద్ధంగా బాధ్యతాయుతమైన సూపర్‌ పవర్‌గా చైనా అవతరిస్తుంది’ అని సింగపూర్‌కు చెందిన ఐఎస్‌ఈఏఎస్‌-యూసోఫ్‌ ఇషాక్‌ ఇన్‌స్టిట్యూట్‌ విజిటింగ్‌ ఫెలో గుయెన్‌ ఖాక్‌ గియాంగ్‌ అన్నారు.ఎగుమతులపై అమెరికా వాణిజ్య విధానాల వల్ల కలిగే నష్టాలను భర్తీ చేసుకోవడానికి చైనా ఇతర దేశాల సహకారాన్ని కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. వియత్నాం, చైనా అధికారిక మీడియాలో సంయుక్తంగా ప్రచురితమైన సంపాదకీయంలో షీ జిన్‌పింగ్‌ ‘వాణిజ్య యుద్ధం లేదా సుంకాల యుద్ధంలో విజేతలు ఉండరు’ అని రాశారు. ఇరు దేశాలు బహుళ వాణిజ్య వ్యవస్థను, స్థిరమైన ప్రపంచ పారిశ్రామిక, సరఫరా గొలుసులను కాపాడుకోవాలని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా రెండు రోజుల పాటు వియత్నాంలోనే జిన్‌పింగ్‌ ఉండనున్నారు. జిన్‌పింగ్‌ పర్యటనను టారిఫ్‌ల ప్రకటన కంటే ముందుగానే ప్లాన్‌ చేసినప్పటికీ ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా, అమెరికా మధ్య సుంకాల పోరు కారణంగా ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. జిన్‌పింగ్‌ వియత్నాం, మలేషియా, కంబోడియా పర్యటన ట్రంప్‌ నుంచి చైనా ఎలా తప్పించుకోగలుగుతుందనే అంశంపైనే సాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2013లో జిన్‌పింగ్‌ చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వియత్నాంలో కేవలం రెండుసార్లు మాత్రమే పర్యటించారు. 2023 డిసెంబర్లో చివరిసారిగా సందర్శించిన ఆయన వియత్నాంకు వెళ్లడం ఇది మూడోసారి.