కంచగచ్చిబౌలి భూముల్లో చెట్లను నరకలేదు

` జంతువులను కూడా చంపలేదు
` తెలంగాణపై ఎందుకిలా మాట్లాడారో ప్రధాని చెప్పాలి
` తెలంగాణ భాజపా నేతలు ప్రధాని మోదీకి తప్పుడు సమాచారం ఇస్తున్నారు
` రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని బద్నాం చేయొద్దు :శ్రీధర్‌బాబు
హైదరాబాద్‌(జనంసాక్షి):కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతోందని కంచ గచ్చిబౌలి భూములను ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ప్రభుత్వం తిప్‌ఇపకొట్టింది. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు. తెలంగాణ గురించి ప్రధాని మోడీ ఎందుకు అలా మాట్లాడారో మాకు తెలియదు. కానీ కంచ గచ్చిబౌలి భూముల్లో మేం చెట్లను నరకలేదు.. జంతువులను చంపలేదని స్పష్టం చేశారు. అడవులను పెంచి ప్రకృతిని కాపాడటమే కాంగ్రెస్‌ ప్రభుత్వం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని.. వాస్తవాలను కోర్టుకు తెలియజేస్తామని పేర్కొన్నారు. కంచ గచ్చిబౌలిలో అటవీ భూమి లేదని.. ఆ భూముల్లో వివిధ సంస్థలు ఉన్నాయన్నారు. మంత్రి శ్రీధర్‌ బాబు కూడా ప్రధాని మోడీ వ్యాఖ్యలపై స్పందించారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని.. కోర్టు పరిధిలో ఉన్న ఇష్యూపై ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడారని నిలదీశారు. కంచ గచ్చిబౌలిలో అసలు అటవీ భూమి లేదన్నారు. కంచ గచ్చిబౌలి భూములపై బీజేపీ నేతలు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని.. వాస్తవాలను మేం కోర్టు ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలను బద్నాం చేయకండని హితవు పలికారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతోందని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ మహేష్‌ గౌడ్‌ కౌంటర్‌ ఇచ్చారు. హెచ్‌సియూలో ప్రధాని మోడీ ప్రారంభించిన 5 బిల్డింగులకు అనుమతులు లేవని.. మున్సిపల్‌, అటవీ, పర్యావరణ పర్మిషన్లు లేకుండానే లేకుండా భవనాలు నిర్మించారని అన్నారు. అలాగే.. మోడీ ఎన్నికల ర్యాలీల కోసం బీజేపీ లక్షల చెట్లను నరికేసిందని ఆరోపించారు. ఐదేండ్లలో 1.09 లక్షల చెట్లు తొలగించామని పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని గుర్తు చేశారు. అంబానీ, అదానీల కోసం బీజేపీ వేల చెట్లను నరికేందన్నారు. చెట్లను నరకడం బీజేపీ సంస్కృతి అని.. చెట్లను నాటడం కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానమన్నారు. ప్రధాని మోడీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని.. ఆయన గతం మర్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. అంతకుముందు హర్యానాలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. అడవులపై బుల్డోజర్లను నడిపించడంలో తెలంగాణ కాంగ్రెస్‌ సర్కార్‌ బిజీగా ఉందంటూ కంచ గచ్చిబౌలి భూములను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాము పర్యావరణాన్ని కాపాడుతుంటే వాళ్లు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారని ఆరోపించారు. గ్యారంటీ-ల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక ప్రకృతిని ధ్వంసం చేస్తూ వన్యప్రాణులను చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.