పాక్‌ క్రికెటర్లలో అవినీతి ఏల?

కరాచీ, జూలై 5 : పాక్‌ ఆటగాడు డానిష్‌ కనేరియాపై యావజ్జీవం నిషేధం విధించినప్పుడు ప్రతిభ కల ఆటగాళ్లు అవినీతి పట్ల ఎందుకు ఆకర్షితులవుతున్నారన్న ప్రశ్న ఉదయిస్తోంది. 2010లో బ్రిటన్‌లోని లార్డ్స్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ ఆటగాళ్లు స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో టెస్ట్‌ కెప్టెన్‌ సల్మాన్‌ భట్‌, పేసర్‌ మహ్మద్‌ ఆసిఫ్‌, మహ్మద్‌ అమీర్‌లపై కేసు నడిచింది. చివరకు వారు జైలు పాలయ్యారు. పాకిస్తాన్‌లో అవినీతి ఒక జీవన విధానంగా ఉంది. గత నెల పాక్‌ ప్రధాని యూసుఫ్‌ రాజా గిలానీ అవినీతి కేసులు తిరగదోడాలని అక్కడి సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను ఖాతరు చేయకపోటంతో పదవి కోల్పోయారు. అక్కడ ప్రభుత్వ యంత్రాంగ పాలన ఉందా లేదా అనేది సందేహాస్పదంగా ఉంది. ఒక తాలిబన్‌, అల్‌కైదా తీవ్రవాద సంస్థలు పెట్రేగిపోతున్నాయి. క్రికెట్‌ అక్కడ ప్రజాదరణ పొందిన ఆట. ఇక అవినీతి సామాజిక రుగ్మతగా వర్దిల్లుతోంది. కాగా అమీర్‌ లాంఇ ఆటగాళ్లు దారిద్య్రపు నేపథ్యం నుంచి వచ్చారు. వారికి క్రికెట్‌ అవినీతి అదనపు ఆదాయంగా కనిపించటం ఒక కారణం. ఆటగాళ్లలో అత్యధికం పేద కుటుంబాల నుంచి వచ్చినవారే. భారీ మొత్తాల పట్ల వారు విచారకరంగా ఆకర్షితులవుతున్నారని మాజీ కెప్టెన్‌ ఒకరు చెప్పారు.