పాక్ జట్టులోకి తిరిగి రానున్న అఫ్రిది , యూనిస్
ఛాంపియన్స్ ట్రోఫీలో చెత్త ప్రదర్శనతో పాకిస్థాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. జట్టులోని పలువురి ఆటగాళ్లపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సెలక్టర్లు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టనున్నారు. దీనిలో భాగంగా సీనియర్ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, యూనిస్‌ఖాన్‌లకు పిలుపు ఇవ్వనున్నట్టు సమాచారం. వచ్చే వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనలకు వీరిద్దరినీ ఎంపిక చేయాలని పిసిబి సెలక్టర్లు భావిస్తున్నారు. గత కొంత కాలంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోన్న ఆల్‌రౌండర్ అఫ్రిదిని ఛాంపియన్స్ ట్రోఫీ నుండే పక్కన పెట్టారు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ పూర్తిగా విఫలమవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అఫ్రిది వన్డే కెరీర్ ముగిసిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం పాక్ జట్టు పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సీనియర్ల సేవలు అవసరమని సెలక్టర్లు అభిప్రాయపడుతున్నారు.
అటు అఫ్రిది కూడా జట్టులో చోటు కోల్పోయినా… రీ ఎంట్రీపై ఆశలు వదులుకోలేదు. గత కొన్ని రోజులుగా నెట్ ప్రాక్టీస్‌లో బిజీగా గడుపుతున్నాడు. ఇంకా కొన్నేళ్ళు పాక్ క్రికెట్‌కు సేవలందిస్తానన్న నమ్మకం ఉందని అఫ్రిది వ్యాఖ్యానించాడు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీలో సీనియర్ ఆల్‌రౌండర్ అఫ్రిది లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఆడిన మూడు మ్యాచ్‌లలో పాక్ ఓడిపోవడంతో అఫ్రిది ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని అభిమానులు చెబుతున్నారు. కొత్త ఆటగాళ్ళకు చోటు ఇవ్వడం తప్పుకాదని, అయితే ఒకేసారి సీనియర్లను పక్కన పెట్టడం సరికాదని మాజీలు కూడా వాదిస్తున్నారు. అటు సీనియర్ బ్యాట్స్‌మెన్ యూనిస్‌ఖాన్ కూడా జట్టులోకి తిరిగి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో బౌలర్లు రాణించినా… బ్యాట్స్‌మెన్ వైఫల్యం పాక్ ఓటములకు కారణమైంది. దీంతో మిడిలార్డర్‌లో అనుభవమున్న ఆటగాడి అవసరం ఖచ్చితందా ఉందని సెలక్టర్లు భావిస్తున్నారు. అటు కరేబియన్ గడ్డపైన సిరీస్ గెలవడం పాక్ జట్టుతో పాటు కోచ్ డేవ్‌వాట్‌మోర్‌కు చాలా కీలకంగా మారింది. వాట్‌మోర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరు టెస్టులు ఆడిన పాక్ నాలుగింటిలో ఓడిపోయింది. అలాగే 22 వన్డేల్లో 12 మ్యాచ్‌లలో పరాజయం పాలైంది.