పాక్‌ పరాజయం

  

వర్షంతో పలుమార్లు మ్యాచ్‌కు అంతరాయం

డక్‌వర్త్‌ లూయిస్‌లో భారత్‌ ఘన విజయం

బర్మింగ్‌హామ్‌, జూన్‌ 15 (జనంసాక్షి) :

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  మొదట బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ జట్టు 39.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌటయ్యింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ నాసిర్‌ 2, అక్మల్‌ 21, హఫీజ్‌ 27, షాఫీక్‌ 41, మిస్బా 22, షోయబ్‌ మాలిక్‌ 17, అమిన్‌ 27 (నాటౌట్‌), అజ్మల్‌ 5 పరుగులు చేయగా,, రియాజ్‌, జునేద్‌ ఖాన్‌, ఇర్ఫాన్‌ డకౌట్‌ అయ్యారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ జట్టుకు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించింది. 11.3 ఓవర్ల వద్ద మరోసారి వర్షం కురవడంతో అంపైర్లు డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం భారత్‌ లక్ష్యాన్ని 63 బంతుల్లో 39 పరుగులుగా నిర్ణయించారు.భారత్‌ మరో 17 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. శిఖర్‌ ధావన్‌ 70 బంతుల్లో 48 (5 ఫోర్లు) పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. కోహ్లి 22, రోహిత్‌ 18, దినేష్‌ కార్తీక్‌ 11 పరుగులు చేశారు.

భారత బౌలర్లలో భువనేశ్వర్‌, ఇషాంత్‌, జడేజా, అశ్విన్‌ రెండేసి వికెట్లు తీశారు.