పాక్‌ బరితెగింపు..

– భారత్‌ ఆర్మీపై కాల్పులు 
– బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ మృతి
శ్రీనగర్‌, మే16(జ‌నం సాక్షి ): రంజాన్‌ మాసం సందర్భంగా భారత ఆర్మీ కాల్పులు నిలిపివేసినప్పటికీ.. పాకిస్తాన్‌ వైపు నుంచి కవ్వింపులు ఆగడం లేదు. శుక్రవారం పాక్‌ రేంజర్లు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. జమ్మూ కశ్మీర్‌లోని ఆర్‌ఎస్‌ పురా సెక్టార్‌లో నియంత్రణరేఖ వద్ద భారత సైనికులపై కాల్పులకు దిగారు. తెల్లవారు జామున చోటుచేసుకున్న ఈ కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ జవాను సీతారామ్‌ ఉపాధ్యాయ్‌ ప్రాణాలు కోల్పోయాడు. మరో సైనికుడు, ఇద్దరు పౌరులకు తీవ్ర గాయాలయ్యాయి. మెహబూబా ముఫ్తీ ప్రభుత్వ ప్రతిపాదన మేరకు రంజాన్‌ నెలలో ఉగ్రవాదుల వేట చేపట్టవద్దంటూ కేంద్రం సైన్యాన్ని కోరింది. ఇది జరిగిన రెండు రోజులకే పాక్‌ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం గమనార్హం. కాగా రంజాన్‌ సందర్బంగా జమ్మూ కశ్మీర్‌లో సైనిక ఆపరేషన్లు నిలిపివేయడాన్ని అమర జవాను భార్య తీవ్రంగా వ్యతిరేకించింది. రంజాన్‌ సందర్భంగా సైనికులు కాల్పులు జరపవద్దంటూ ప్రభుత్వం సైన్యాన్ని ఆదేశించింది. కాని పాకిస్తాన్‌ జరిపిన కాల్పుల్లో నా భర్త చనిపోయాడు. పరిహారం ఇచ్చినంత మాత్రాన నాకు ఒరిగేదేమిటి? అది నా భర్తను వెనక్కి తీసుకుని రాగలదా? అంటూ ఆమె కంటతడి పెట్టింది.
———————————