పాటిదార్‌ ఆందోళన మరింత ఉధృతం

చర్చలకు రాకుంటే మంచినీళ్లు కూడా ముట్టం
హెచ్చరిక చేసిన హార్ధిక్‌ పటేల్‌
గాంధీనగర్‌,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి):  పాటిదార్‌లకు విద్య,ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ పాటిదార్‌ నేత హార్థిక్‌ పటేల్‌ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష పన్నెండో రోజుకి చేరుకుంది. దీంతో వచ్చే 24గంటలలోగా గుజరాత్‌లోని బిజెపి ప్రభుత్వం తనతో చర్చలు జరపకపోతే నీటిని తాగడం కూడా ఆపేస్తానని ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన అనంతరం పాటిదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి (పాస్‌) కన్వీనర్‌ మనోజ్‌ పనరా ప్రభుత్వ ప్రతినిధులు దీక్ష చేపడుతున్న వేదిక వద్దకు వచ్చి హార్థిక్‌తో చర్చించాలని కోరారు. హార్థిక్‌ ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికి ఈ సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించటం లేదని ఆయన పేర్కొన్నారు. 24 గంటలలోగా చర్చలు ప్రారంభించకపోతే నీటిని తాగడం
ఆపేస్తానని ప్రకటించడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతవారం హర్థిక్‌ నీటిని తాగడానికి తిరస్కరించారని అయితే ఆయన మద్దతుదారులు ఒప్పించడంతో నీటిని తీసుకోవడం ప్రారంభించారని ఆయన తెలిపారు. గాంధీనగర్‌లో కొందరు పాటిదార్‌ నేతలు, ప్రభుత్వాధికారుల మధ్య మంగళవారం ఒక సమావేశం జరిగిందని, దీంతో సమావేశం నిర్వహిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంటూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని పనారా ఆరోపించారు. హార్థిక్‌తో చర్చించకుండా మధ్యవర్తులతో చర్చించడం ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదని, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రభుత్వం ఈవిధంగా ప్రయత్నిస్తోందని పాస్‌ కన్వీనర్‌ పేర్కొన్నారు.