పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంపై ఆందోళన
ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టాలంటున్న పార్టీలు
విజయవాడ,నవంబర్12(జనంసాక్షి): కరోనా కాలంలో పాఠశాలలు ప్రారంభించిన సందర్భంగా అనేక మంది విద్యార్థులు టీచర్లు వైరస్ బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సమయంలో స్కూళ్లు అవసరమా అన్న చర్చ సాగుతోంది. అలాగే పాఠశాలలు నడపాలన్న ఆలోచనను టిడిపి, లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.అయితే స్కూళ్లు ఎలాగా మొదలయ్యాయి కనుక పిల్లలకు బడి అలవాటు తగ్గిపోకుండా చేయడానికి జాగ్రత్తగా నడపాలని సూచించారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం పౌష్లికాహారంగా ఉండాలని చెప్పారు. తల్లిదండ్రులే పిల్లలను బడికి తీసుకెళ్లడం, తీసుకురావడం చేయాలని సూచించారు. లేదంటే గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించాలని తెలిపారు. చదువుతో పాటు ఆరోగ్యం ముఖ్యం కావున , చదువు కంటే ఆరోగ్యమే ముఖ్యం అన్నది ఆలోచించాలని అంటున్నారు.కరోనా కాలంలో బడులు తెరవడంపై భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. తెరిచేందుకు అనుకూల వాతావరణం ఉందా అన్నది ప్రభుత్వం ఆలోచించకుండా ఏకపక్ష నిర్ణయంతో పాఠశాలలు తెవడంతో అనేకమంది వైరస్ బారిన పడ్డారని లెఫ్ట్, టిడిపి నేతలు మండిపడుతున్నారు. ఆన్‌లైన్ తరగతులు కొనసాగు తున్నప్పటికీ అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నాయి. మరోవైపె విద్యాసంవత్సరం లాస్ అవుతుందనే ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంది. అయితే పాఠశాలల్లో ఎలాంటి సౌకర్యాలు లేవు. ప్రతి పిల్లవాడికి చేతులకు గ్లౌజులు ఇవ్వడం, రన్నింగ్ వాటర్, శానిటైజర్లు, సబ్బు వంటి ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయడంలేదు. పాఠశాల అభివృద్ధి నిధుల నుంచి ఖర్చు చేసుకోవాలని చెప్పింది. అరకొర సౌకర్యాలతో నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో చదువులు సంగతి వెనక్కు పోయి, పిల్లలకు రక్షణ లేక కరోనా బారిన పడుతున్నారనే విమర్శలు ముందుకొచ్చాయి.పాఠశాలలు ప్రారంభం వల్ల కరోనా కేసులు ఎక్కువయ్యాయని ఢిల్లీల్లో మరలా బడులు మూసేశారు. జాగ్రత్తలు లేకపోతే రాష్ట్రంలో కూడా ప్రమాదకరంగా మారి విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. నాడునేడు కింద పాఠశాలలను అభివృద్ది చేసేందుకు యత్నించినా అవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. రాష్ట్రంలో పాఠశాల వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. ఇరుకు గదులు, తక్కువ గదుల్లోనే తరగతులు నడుస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించడం ప్రధాన సమస్యగా మారుతుంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సవిూక్షించి ఆరోగ్యశాఖ నుంచి నివేదికలు తెప్పించుకోవాల్సి ఉంది. కరోనా ఎక్కువగా ఉన్న చోట తరగతులు నిర్వహించరాదని పలు సూచనలు వస్తున్నాయి. ఆరోగ్యశాఖతో సమన్వయం చేసుకోవడం ముఖ్యమైన అంశం. ప్రతి రోజు పాఠశాలలు, కళాశాలలను సందర్శించేలా వైద్య ఆరోగ్య సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. ప్రతి పిల్లవాడి ఆరోగ్యం, అతని ఇంటి పరిసరాల్లో కరోనా కేసులు ఉన్నాయా అనే లెక్కలను తీసుకొని, ఆ పిల్లలను బడికి రాకుండా చూడాలి. పిల్లల హాజరుపై ఉపాధ్యాయులను విద్యాశాఖ ఒత్తిడి చేయకూడదని కూడా అంటున్నారు. ఇప్పటికే సగం విద్యాసంవత్సరం పూర్తయింది. సిలబస్ పూర్తికాలేదు. విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉండడంతో పిల్లలపై ఒత్తిడి చేయవద్దని సిఎం జగన్ ప్రత్యేకంగా ఆదేశించారు. పిల్లలు ఇంటి దగ్గర ఎవరికి వారే చదువుకునే పద్ధతుల్లో చదువులు ఉండాలన్నారు. అన్నీ బడిలోనే నేర్పడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఒక రోజు బడికి హాజరై రెండు రోజులు ఇంటిలో చదువుకునేలా నిర్వహిస్తున్నారు.