పాడి రైతులను ఆదుకునేందుకే బర్రెల పథకం

ముల్కనూరులో ప్రారంభించిన మంత్రి తలసాని

వరంగల్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బర్రెల పంపిణీ పథకం ప్రారంభమైంది. వరంగల్‌ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో బర్రెల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ఉద్ఘాటించారు. గొప్ప సంకల్పం ఉన్న మ¬న్నత వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని మంత్రి కొనియాడారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంక్షేమ పథకాన్ని శనివారం నుంచి ప్రారంభిస్తోందని అన్నారు. పాల ఉత్పత్తిని పెంచేందుకు, పాడి రైతులను ప్రోత్సహించేందుకుగాను కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్‌, ఎంపీ వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌, ముల్కనూరు మహిళా సహకార సంఘంలోని సభ్యులతో పాటు రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ముల్కనూరు మహిళా సహకార డైరీలో అర్హులైన 88 మంది మహిళలకు బర్రెలను పంపిణీ చేశారు. వరంగల్‌ జిల్లాలో రూ. 110.87 కోట్లతో పాల ఉత్పత్తిదారులకు బర్రెలను పంపిణీ చేశారు.

పాడి పశువుల పంపిణీ పథకానికి సీఎం కేసీఆర్‌ రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. పాల ఉత్పత్తికి, సహకార స్ఫూర్తికి కేంద్ర బిందువైన వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ముల్కనూర్‌ నుంచి బర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు. వందమంది పాడి రైతులకు లాంఛనంగా బర్రెలు పంపిణీ చేసారు. ఈ పథకంలో విజయ డెయిరీలో సభ్యులుగా ఉన్న 63,304 మంది, ముల్కనూర్‌ మహిళా డెయిరీలో సభ్యులు గా ఉన్న 19,307 మంది, కరీంనగర్‌ డెయిరీలో సభ్యులుగా ఉన్న 57,206 మంది, మదర్‌ డెయిరీలో సభ్యులుగా ఉన్న 43,006 మందిని లబ్దిదారులుగా గుర్తించారు. రూ. 1,500 కోట్లను ప్రభుత్వం సబ్సిడీగా అందించనుంది. ఒక్కొక్క యూనిట్‌కు రూ. 80వేలుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలకు 75శాతం , బీసీలకు 50శాతం సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది.