పార్కింగ్‌ స్థలం లేకపోతే కారు కొనద్దు

త్వరలోనే నిబంధనలు అమల్లోకి తెస్తాం
తద్వారా ట్రాఫిక్‌ను కొంతమేర తగ్గించవచ్చు
కర్ణాటక రవాణాశాఖ మంత్రి తమ్మన్న
బెంగళూరు, జూన్‌21(జ‌నం సాక్షి) : బెంగళూరు ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో పార్కింగ్‌ స్థలం చూపించలేకపోతే కారు కొనడానికి అవకాశం లేదని కర్ణాటక రవాణా శాఖ మంత్రి తమ్మన్న పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదన రవాణా శాఖ వద్ద పరిశీలనలో ఉందని ఆయన వెల్లడించారు. దీన్ని ఎప్పుడైనా అమలు చేస్తామన్నారు. పార్కింగ్‌కు స్థలం లేకపోవడంతో రోడ్ల పక్కనే కార్లు ఆపుతున్నారు. దీని వల్ల తీవ్ర ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. రహదారులు ఏ ఒక్కరి కోసమో కేటాయించినవి కాదని, కొత్తగా తీసుకువచ్చే ఈ నిబంధనల వల్ల ప్రజలు కార్లు కొనుగోలు చేయడం తగ్గుతుందని ఆశిస్తున్నానన్నారు. వ్యక్తిగత వాహనాలకు బదులు ప్రజారవాణాను ఉపయోగించాలని మంత్రి వెల్లడించారు. కారు కొనాలంటే పార్కింగ్‌ స్థలం ఉన్నట్లు ఆధారం చూపించాలన్న నిబంధన ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ లేదు. కారు కొనుగోలు చేయాలనుకున్న వారు తప్పనిసరిగా పార్కింగ్‌ స్థలాన్ని అందుబాటులో ఉంచాలని 2016లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు ప్రతిపాదించారు. అయితే కార్యరూపం దాల్చలేదు. ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చే ముందు ప్రజలకు దీనిపై అవగాహన కలిగిస్తాం. దీన్ని ప్రజలు సహృదయంతో అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. సౌకర్యాలకంటే ఆరోగ్యం చాలా ముఖ్యం’ అని ఆ మంత్రి అన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం బెంగళూరులో ప్రస్తుతం 15లక్షల వ్యక్తిగత కార్లు అందుబాటులో ఉన్నాయి. నిత్యం 300-500 కొత్త కార్లు రిజిస్టరవుతున్నాయి. 2014లో ఎనర్జీ అండ్‌ రిసోర్స్‌ ఇనిస్టిట్యూట్‌ వెల్లడించిన నివేదిక ప్రకారం జపాన్‌లో కారును రిజిస్టర్‌ చేయించుకోవాలంటే పార్కింగ్‌ స్థల ధ్రువీకరణ తప్పనిసరి.  చైనా కూడా కొన్ని నగరాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ఢిల్లీ రవాణా శాఖ కూడా దీనిపై కసరత్తు చేసింది. ఇతరుల స్థలంలో కారు పార్కింగ్‌ చేస్తే కొంత రుసుము విధించాలని అందులో పేర్కొంది.