పార్లమెంట్‌లో టీ-ఎంపీల ధర్నా తొలిరోజే సభకు గైర్హాజరు
తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలి
అప్పటి వరకు సభకు హాజరు కాబోమన్న ఎంపీలు
న్యూఢిల్లీ, నవంబర్ 22 :ఢిల్లీలో మరోమారు తెలంగాణ నినాదం మార్మోగింది. పార్లమెంట్ సమావేశాల ప్రారంబానికి ముందే తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన బాట పట్టారు. తొలిరోజు సమావేశాలకు డుమ్మకొట్టిన ఎంపీలు.. పార్లమెంట్ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేపట్టారు. తెలంగాణపై నిర్ణయం ప్రకటించే వరకూ సభకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. గురువారం ఉదయం టీ-ఎంపీలు మధుయాష్కీ నివాసంలో భేటీ అయ్యారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహం, అధిష్టానంపై ఒత్తిడి పెంచే విషయంపై చర్చించారు. అక్కడి నుంచి నేరుగా పార్లమెంట్‌కు చేరుకొని, ఒకటో నెంబర్ గేటు ఎదుట బైఠాయించారు. ఎంపీలు మందా జగన్నాథం, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మధుయాష్కి, పొన్నం ప్రభాకర్, రాజయ్య, వివేక్ ప్లకార్డులు పట్టుకొని, తెలంగాణ నినాదాలతో ¬రెత్తించారు. తక్షణమే తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలంటూ నినాదాలు చేశారు. వారి ఆందోళనకు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జగదేకర్ సంఘీబావం ప్రకటించారు. విూ కల త్వరలోనే నెరవేరాలని వారు ఆకాంక్షించారు. అనంతరం ఎంపీలు విూడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాలకు తాము హాజరు కాబోమని స్పష్టం చేశారు. తెలంగాణకు అనుకూలంగా స్పష్టమైన ప్రకటన చేస్తేనే సభకు హాజరవుతామని తేల్చి చెప్పారు. తెలంగాణ కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. స్పష్టమైన నిర్ణయం తీసుకోక పోవడం వల్ల తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరిస్తున్నారని, ఇంకా ఇదే ధోరణి కొనసాగిస్తే పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని మందా జగన్నాథం హెచ్చరించారు.