పాలకుల చేతుల్లో సామాన్య ప్రజల బతుకులు చిన్నాభిన్నం
ఇంటి నిర్మాణం కోసం 3లక్షల హామీ ఏమైంది..?
– సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్
చేర్యాల (జనంసాక్షి) నవంబర్ 17 : పాలకుల చేతుల్లో సామాన్య ప్రజల బతుకులు చిన్నాభిన్నం అవుతున్నాయని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ అందె అశోక్ అన్నారు. గురువారం వారు కార్యకర్తలతో కలిసి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇండ్లు లేని ప్రతీ నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేస్తామని ఎన్నికల్లో అనేక ప్రగల్బాలు పలికి ఏదో ఒక గ్రామంలో అరకొరగా కేటాయించి చేతులు దులుపుకుందన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలకు ఉండటానికి కనీసం ఇంటి స్థలాలు లేక, ఇంటి స్థలాలు ఉంటే ఇంటి నిర్మాణం చేపట్టే స్తోమత లేకపోవడంతో పూరి గుడిసెల్లో ఆర్థిక ఇబ్బందులతో దుర్భర జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణం కోసం 3లక్షల రూపాయలు ఇస్తామన్న హామీ ఏమైందని వారు ప్రశ్నించారు. రెండవ సారి ప్రభుత్వం ఏర్పడినా నేటి వరకూ అమలు చేయకపోవడం ప్రభుత్వ అసమర్ధత పాలనకు నిదర్శనమని వారు అన్నారు. ఇండ్లు లేని నిరుపేదలను ఏకం చేసి సీపీఐ పక్షాన పోరాడుతామని వారు తెలిపారు. ఈసమావేశంలో సీపీఐ పట్టణ కార్యదర్శి ఉడుగుల శ్రీనివాస్, నాయకులు గూడెపు సుదర్శన్, తిగుల్ల కనకయ్య, సంజయ్, రమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.