పాలన అస్తవ్యస్తంగా ఉంది

` ధాన్యం కొనుగోళ్లు జరగడంలేదు
` రాష్ట్రంలో రైతుల దైన్యంగా రైతుల పరిస్థితి
` బీజేపీ ఎంపి తేజస్వీ సూర్య వ్యాఖ్యలు దుర్మార్గం
` ఒక్కరు కూడా ఎదిరించి మాట్లాడలేక పోయారు
` బీఆరఎస్ ఎంపీలు ఉంటే రణరంగం సష్టించేవారు
` తెలంగాణ భవన్‌లో బీఆరఎస్ అధినేత కేసీఆర్
` తెలంగాణలో ఏం జరుగుతోందో అర్థం కావట్లేదని వ్యాఖ్య
` రాష్ట్ర ప్రజలు ఆవేదన చెందుతున్నారన్న మాజీ ముఖ్యమంత్రి
హైదరాబాద్(జనంసాక్షి):రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని మాజీ సీఎం, బీఆరఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రభుత్వానికి ధాన్యం కొనడం చేత కావట్లేదని విమర్శించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. తెలంగాణ గురించి ఎంపీ తేజస్వి సూర్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్, భాజపా ఎంపీలు ఒక్కమాట మాట్లాడలేదు. బీఆరఎస్ ఎంపీలు లోక్‌సభలో ఉండి ఉంటే రణరంగం సష్టించేవాళ్లు. కాళేశ్వరంపై రాజ్యసభలో సీఆర్ పాటిల్ మాట్లాడితే సురేశ్‌రెడ్డి గట్టిగా ఖండించారు. తెలంగాణ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్, భాజపా నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో.. హైదరాబాద్ విషయంలో రాజీ పడాలని సోనియా గాంధీ ఎన్నో సార్లు చెప్పారు. కానీ.. నేను ఎప్ప్పుడూ రాజీ పడలేదు..అది నా చిత్తశుద్ధి అని కేసీఆర్ అన్నారు.బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై బీఆరఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. డీలిమిటేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా బ్రిటిషర్లు భారత్, పాకిస్థాన్‌ను వేరుచేసినట్టు అత్యంత చెత్త విధానంతో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరుచేశారంటూ తేజస్వి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలోనే ఉన్న కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సహా 16మంది రాష్ట్ర ఎంపీలు ఎవరూ దానిపై కనీసం అభ్యంతరం తెలుపకుండా మౌనంగా ఉన్నారని.. అదే పార్లమెంట్‌లో మన ఎంపీలు ఉండుంటే తేజస్వి సూర్య మాట్లాడిన మాటలకు రణరంగం చేసేవాళ్లు అని పార్టీ అంతర్గత సమావేశంలో అభిప్రాయపడ్డారు.ఈ 16 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణలో పుట్టలేదా? వాళ్లకు తెలంగాణ పౌరుషం లేదా? అని ప్రశ్నించారు. ఎంపీ తేజస్వి సూర్య అనే వెధవ మాట్లాడిన మాటలను ఎందుకు ఎండగట్టలేదని నిలదీశారు. అదే ఒక్క బీఆరఎస్ ఎంపీ ఉన్నా పార్లమెంట్‌లో క్షమాపణ చెప్పించేటోళ్లమని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండి పౌరుషంగా లేకుండా వ్యవహరించారని మండిపడ్డారు. ఒకప్ప్పుడు తెలంగాణ రాష్టాన్ని వ్యవసాయ రంగం నుంచి ఇతర అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా నిలబెట్టామని కేసీఆర్ తెలిపారు. కానీ ఈ ప్రభుత్వం భూముల కబ్జాల్లో నంబర్‌వన్, కూలగొట్టడంలో నంబర్‌వన్‌గా నిలబట్టే ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయలేని స్థితిలో చేతకానితనంతో ఉన్నదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లు లేకపోవడం వల్ల రైతన్నలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే తీవ్రంగా బాధ అవుతుందని అన్నారు. చిల్లర కూతలు, చిల్లర మాటలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, మంత్రులను చూస్తే జాలి వేస్తుందని అన్నారు. ఇక ఈ అంతర్గత సమావేశంలోనే జీవన్ రెడ్డిని బీఆరఎస్ కార్యవర్గానికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని పార్టీ జనరల్ సెక్రటరీగా ప్రకటించారు.