పాలమూరును ఎడారిగా మార్చిన ఘనత కాంగ్రెస్‌దే
కల్వకుర్తి సభలో మండిపడ్డ కెటిఆర్
నాగర్‌కర్నూల్,నవంబర్1(జనంసాక్షి): పాలమూరు పచ్చబడుతుంటే కాంగ్రెస్ కళ్లు ఎర్రబడుతున్నాయని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పాలమూరును ఎడారి జిల్లాగా మార్చింది కాంగ్రెస్సేనని మండిపడ్డారు. నాలుగేళ్లలో పేదల ముఖంలో నవ్వులు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు. జిల్లాలోని కల్వకుర్తిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి.. ప్రతి మనిషికి ఆరు కిలోల బియ్యం, పేదింటి ఆడబిడ్డకు కులం, మతం ఏదైనా షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ సాయం చేస్తున్నామన్నారు. ‘ఎరువులు, విత్తనాల కోసం కాంగ్రెస్ హయాంలో క్యూలు కట్టిన పరిస్థితులు ఉన్నయి. ప్రపంచంలో రైతు బంధు పథకం ద్వారా రైతులకు డబ్బులు ఇచ్చిన చరిత్ర కేసీఆర్‌దే. మళ్లీ అధికారంలోకి వచ్చాక రూ.10 వేలు ఇస్తాం. 57 సంవత్సరాలు నిండగానే పించన్లు ఇస్తాం. కల్వకుర్తిలో 35 వేల ఎకరాలకు నీళ్లు వచ్చాయి. మళ్లీ అధికారంలోకి వచ్చాక కల్వకుర్తిలో 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తాం. కాంగ్రెస్ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి కోర్టుకు పోయి పాలమూరు ఎత్తిపోతల పథకం పనులను ఆపేందుకు తప్పుడు కేసులు వేశారు. కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలుపుతామన్న టీడీపీ అదే పార్టీతో పొత్తు పెట్టుకుంది. చిత్రవిచిత్రమైన పొత్తు అది. తెలంగాణ విూద మట్టి పడాలని కేంద్రానికి బాబు 30 లేఖలు రాసిండు . ఏమన్నా అంటే కాంగ్రెస్ కోర్టుకు, బాబు ఢిల్లీకి పోతడు. పొరపాటున వాళ్లకు ఒక్క ఓటు వేసినా నోట్లో మట్టి పోసుకున్నట్టే. జిల్లాలో 8 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చాం. నీళ్లు కావాలో.. కన్నీళ్లు కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఇది. కూటమి పేరుతో ఎగిరెగిరి పడుతున్నరు. కేసీఆర్‌ను ఎందుకు గ్దదె దించాల్నో కూటమి చెప్పాలి. కల్వకుర్తి పౌరుషం చాటాలి..’ అంటూ మంత్రి తెలిపారు.