పాలమూరుపై సుప్రీంలో పిటిషన్‌

న్యూదిల్లీ,మే6(జ‌నంసాక్షి):  తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-డిండి ప్రాజెక్టులపై గుంటూరు జిల్లా రైతులు శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ ప్రయోజనాలు భంగం కలిగించే విధంగా ప్రాజెక్టులు ఉన్నాయని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. కృష్ణా, గోదావరి బోర్డుల అనుమతి లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఏపీ వాదనలు వినిపించగా, ఉమ్మడి రాష్ట్రంలోనే పాలమూరు-డిండి ప్రాజెక్టుకు అనుమతులు లభించాయని తెలంగాణ తెలిపింది. వాటికి నీటి కేటాయింపులే లేవని ఎలా కడతారని రైతుల తరపు వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది శ్రీగిరి ప్రశ్నించారు. అయితే దశాబ్దాల కిందట ఉమ్మడి ఏపీలో ప్రారంభించిన ప్రాజెక్టులనే తాము కడుతున్నామని తెలంగాణ ప్రభుత్వం తరపున

వైద్యనాదన్‌ వాదనలు వినిపించారు. ఎప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అనుమతులు లేకుండా ఎలా కడతారని కురియన్‌ జోసెఫ్‌, నారీమన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం తెలంగాణ సర్కార్‌ను ప్రశ్నించింది. అన్ని అనుమతులు చూసుకుని ప్రారంభించామన్న వైద్యనాదన్‌ పూర్తి స్థాయి కౌంటర్‌ దాఖలు సమయం కోరారు. జులై 20 వరకు సమయం ఇచ్చిన ధర్మాసనం అడిషనల్‌ అఫిడవిట్‌ దాఖలుకు ఏపీ రైతులకు అనుమతినిచ్చింది.  అనంతరం తదుపరి విచారణను జులై 20కి వాయిదా వేశారు. తుది వాదనలు జులై 20న వింటామని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.