పాలమూరు ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
` అడ్డంకులను అధిగమిస్తాం..
` జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాం
` ప్రతీగ్రామానికి, తండాకు బీటీ రోడ్లు వేస్తాం
` మహబూబ్‌నగర్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
` కురుమూర్తి స్వామి దయతోనే సీఎం అయ్యాయని వెల్లడి
` ఆలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేకపూజలు
మహబూబ్ నగర్ బ్యూరో (జనంసాక్షి):
పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందంటే కురుమూర్తి స్వామి దయేనని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్‌లో కురుమూర్తి స్వామిని దర్శించుకున్న అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.పేదల తిరుపతిగా కురుమూర్తిస్వామిని కొలుస్తారని చెప్పారు. ఇక్కడ దర్శించుకుంటే తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నట్లేనన్నారు. ’’ఇప్పటికీ కురుమూర్తి స్వామి ఆలయంలో మౌలిక సదుపాయాలు లేవు. అందుకే రూ.110 కోట్లతో ఘాట్‌రోడ్డు కారిడార్ నిర్మిస్తున్నాం. ఆలయానికి ఏం కావాలో కలెక్టర్ నివేదిక ఇస్తే నిధులు విడుదల చేస్తాం. దేశంలో ఏ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలోనైనా పాలమూరు ప్రజల కృషి ఉంది. మన రాష్ట్రంలో మాత్రం గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టులు పూర్తి కాలేదు. కేసీఆర్ హయాంలో ఇక్కడికి పరిశ్రమలు, ప్రాజెక్టులు రాలేదు. ఇంకా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలో పచ్చని పంటలు పండాలి. మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ప్రాజెక్టులను పూర్తిచేస్తాం. పాలమూరు అభివృద్ధిని కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇక్కడి బిడ్డనై ఉండి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే ప్రజలు క్షమించరు. పాలమూరు ప్రజలు ఓట్లు వేస్తేనే కేసీఆర్ రెండు సార్లు సీఎం అయ్యారు. 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఒక సీఎంను ఈ ప్రాంతం ఇచ్చింది. పాలమూరు రుణం తీర్చుకుంటాం. యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు వచ్చేలా చూస్తాం. గ్రామగ్రామానికి, తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత నాది. విద్య, వైద్యం, ఉపాధి కోసం నిరంతర కృషి చేస్తాం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.అంతకు ముందు కురుమూర్తి ఆలయ సవిూపంలోని ఘాట్ రోడ్డు కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం కురుమూర్తి స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనానంతరం రేవంత్‌రెడ్డికి అర్చకులు వేదాశీర్వచనాలిచ్చారు. కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఇతర నేతలు పాల్గొన్నారు.2009 తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ మహబూబ్ నగర్ నుండి పార్లమెంటు స్థానానికి పోటీ చేయగా జిల్లా ప్రజలు ఆశీర్వదించి గెలిపించారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా ఉండి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి ఏమి చేయలేకపోయారని గుర్తుచేశారు. అప్పుడు వారి సొంత జిల్లాను అభివృద్ధి చేసుకుంటే మేము ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడు నాకు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చి స్వంత జిల్లాను అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తే లేనిపోని ఆరోపణలు చేసి అడ్డుపడుతున్నారని ప్రతిపక్ష పార్టీలపై మండిపడ్డారు. జిల్లా అభివృద్ధికి అడ్డుపడితే ప్రజలే తగిన సమాధానం ఇస్తారని, తాను మాత్రం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తీరుతానని చెప్పారు. జిల్లాలో అన్ని పెండిరగ్ ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి చేస్తామని, త్వరలోనే మక్తల్, కొడంగల్, నారాయణ పేట కు కృష్ణా జలాలు తీసుకొస్తామన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని నిరుద్యోగులకు మాత్రమే అమర్ రాజా బ్యాటరీ సంస్థలో ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని సంస్థ తో మాట్లాడటం జరిగిందని, వారు అందుకు ఒప్పుకున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లాలో వచ్చే పరిశ్రమలు ఇక్కడి నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలోని ప్రధాన దేవాలయాలు మన్యంకొండ, కురుమూర్తి దేవస్థానం అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు దేవాదాయ శాఖ వారితో చర్చించి నివేదికలు ఇవ్వాలని ఈ రెండు దేవాలయాలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. జిల్లాలో ప్రతి గ్రామానికి, తాండాకు బి.టి రోడ్డు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ఇవ్వాల్సిందిగా వేదిక నుండి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, ఉమ్మడి మహబూబ్ నగర జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ఈరోజు తనకు కురుమూర్తి స్వామి దర్శన భాగ్యం కలగటం చాల సంతోషంగా ఉందని అన్నారు. ఈ దేవస్థానానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయని, పేదల తిరుపతిగా భావించే ఈ ప్రాంత భక్తులు, పక్కనే ఉన్న కర్నాటక రాష్ట్రానికి చెందిన ప్రజలు కూడా స్వామివారిని దర్శించుకొని దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకుంటారని అన్నారు. దేవాలయాల అభివృద్ధికి, పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఆయన తెలిపారు. అనంతరం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన పాలమూరు జిల్లాలోని కురుమూర్తి దేవస్థానానికి ఘాట్ రోడ్డు ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని అక్టోబర్ 11న స్థానిక శాసన సభ్యులు జిఎంఆర్ కోరడంతో నవంబర్ 10 న 110 కోట్ల నిధులతో ఘాట్ రోడ్డు, ఎలివేటర్ కారిడార్, ఇతర పనులకు సీఎం చేతుల విూదుగా శంఖుస్థాపన చేసుకున్నట్లు తెలిపారు.వచ్చె బ్రహ్మోత్సవాల వరకు ఘాట్ రొడ్డును ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుందని అన్నారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసన సభ్యులు జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ అడిగిన వెంటనే దేవస్థానానికి నిధులు మంజూరు చేసి నేడు స్వయంగా శంఖుస్థాపన చేసేందుకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లేల చిన్నా రెడ్డి, మహబూబ్ నగర్ శాసన సభ్యులు యెన్నం శ్రీనివాసరెడ్డి, గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, జిల్లా ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్ లు శివేంద్ర ప్రతాప్, మోహన్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.