పాలమూరు – రంగారెడ్డికి లైన్‌ క్లియర్‌

– నాగం పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు
హైదరాబాద్‌, డిసెంబర్‌3(జ‌నంసాక్షి) : పాలమూరు-రంగారెడ్డికి అడ్డంకులు తొలగాయి. ప్రాజెక్టును ఆపాలంటూ కాంగ్రెస్‌ నేత నాగం జనార్ధన్‌ రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ప్రాజెక్టు పనులన్నీ సక్రమంగానే జరుగుతున్నాయని.. పర్యావరణశాఖ కూడా అనుమతులు ఇచ్చిందని కోర్టు తెలిపింది. అవినీతి, అక్రమాలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేనందున నాగం వేసిన పిటిషన్‌ను కొట్టేసినట్లు కోర్టు వెల్లడించింది. దీంతో ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయినట్లయ్యింది. ఈఎత్తిపోతల ప్రాజెక్టులో అవకతవకలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్‌ నేత నాగం జనార్ధన్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ప్రాజెక్టు పనుల్లో కవిూషన్లు తీసుకుంటున్నట్లు ఆరోపిస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు.. విచారణ జరిపింది. గత రెండుమూడు వారాలుగా వాదనలు కూడా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తరపు లాయర్‌ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు, అనుమతుల్ని కోర్టుకు సమర్పించారు. ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతుల్ని, టెండర్లను పరిశీలించిన కోర్టు.. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అక్రమాలు
లేవంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. పాలమూరు ఎత్తిపోతలకు అడ్డంకులు తొలగడంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.