పాలమూరు లిఫ్ట్ పనుల్లో ఘోరప్రమాదం
క్రేన్ వైర్ తెగిపడి ఐదుగురు కార్మికుల దుర్మరణం
రాత్రికిరాత్రే మృతదేహాలు ఉస్మానియాకు తరలింపు
ఘటనాస్థలినిపరిశీలించిన అధికారలు బృందం
మృతుల కుటుంబాలను ఆదుకోవాలన్న బండి, రేవంత్
నాగర్‌కర్నూలు,జూలై29(జనంసాక్షి ): జిల్లాలోని పాలమూరు, రంగారెడ్డి లిప్ట్ ఇరిగేషన్ స్కీం పనుల్లో విషాదం నెలకొంది. కొల్లాపూర్ మండలం రేగమనగడ్డ దగ్గర జరుగుతున్న లిప్ట్ ఇరిగేషన్ స్కీం పనుల్లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు కూలీలు మరణించారు. క్రేన్ సాయంతో పంప్ హౌస్ లోకి దిగుతుండగా వైర్ తెగిపోవడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, ఒకరు తీవ్ర గాయాల పాలయ్యారు. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహలను రాత్రే హైదరాబాద్ ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్య బృందం అభిజిత్ నేతృత్వంలో ఐదుగురు కార్మికుల మృతదేహాలకు పోస్ట్ మార్టం చేపట్టారు. ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు జార్ఖండ్‌కు చెందిన భోలేనాథ్ (45), ప్రవీణ్ (38), కమలేష్ (36 ), బీహార్ కు చెందిన సోను కుమార్ (36), ఆంధప్రదేశ్ కు చెందిన శ్రీను (40)గా గుర్తించారు. ఈ ఘటన పాలమూరు, రంగారెడ్డి ప్యాకేజీ `1లో జరిగింది. మరోవైపు జూన్ 10వ తేదీన పాలమూరు, రంగారెడ్డి లిప్ట్ ఇరిగేషన్ పనులను నేషనల్ లేబర్ కమిషన్ చైర్మన్ పపరిశీలించారు. నిర్మాణ పనుల్లో రక్షణ చర్యలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా లోపాలపై ఇరిగేషన్ అధికారులను హెచ్చరించారు. అయినా.. కాంట్రాక్టు ఏజెన్సీ, అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఇవాళ ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాలమూరు, రంగారెడ్డి లిప్ట్ ఇరిగేషన్ నిర్మాణ పనుల్లో క్రేన్ ప్రమాదం జరిగి ఐదుగురు కార్మికులు మృతిచెందడం తీవ్ర దిగ్భార్రతి కలిగించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఉపాధి కోసం ఇతర రాష్టాల్ర నుంచి వచ్చి ఇక్కడ చనిపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబ సభ్యులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదం జరగడానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రమాదం జరిగి ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందడం దిగ్భార్రతి కలిగించిందని టీ పీసీసీ చీఫ్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.