పాలేరు విజయానికి పువ్వాడ రాక సంకేతం

3ఖమ్మం ప్లీనరీలో సమస్యలపై చర్చ: కడియం
హైదరాబాద్‌,ఏప్రిల్‌25

ఖమ్మం ప్లీనరీ జరుగబోతున్న వేళ, ఖమ్మంనకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పువ్వాడ టిఆర్‌ఎస్‌లో చేరాలనుకోవడం, ఆయన సిఎం కెసిఆర్‌పై వెలిబుచ్చిన అభిప్రాయాలు పరభుత్వ పనితీరు నిదర్శనమని డిప్యూటి సిఎం కడియం శ్రీహరి అన్నారు. కెసిఆర్‌ విజన్‌ ఉన్న నాయకుడని  చెప్పడం చూస్తుంటే ఇతర పార్టీల్లో కూడా ప్రభుత్వ పనితీరుపై సానుకూలత కనిపిస్తోందని అన్నారు. ఇదే రేపు పాలేరులో మరో విజయానికి సూచికని అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయడం కెసిఆర్‌ కు మాత్రమే సాధ్యమయ్యిందని అన్నారు. అయితే కొందరు కావాలనే  విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలను, కార్యకర్తలను భాగస్వాములను చేసే లక్ష్యంతో ఖమ్మంలో జరిగే ప్లీనరీ ఉంటుందని తెలిపారు.  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంగా భావించిన ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని వివరించారు.  మేని ఫెస్టోలో పేర్కొనని అనేక అంశాలను ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. తెరాసను దేశంలోనే నెంబర్‌ వన్‌ పార్టీగా అవతరింపజేసే విధంగా 15వ ప్లీనరీ నిర్వహించనున్నామని కడియం తెలిపారు. ఉద్యమ పార్టీగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఎలాగైతే నెరవేర్చిందో రాజకీయంగా అధికారంలోకి వచ్చిన తర్వాతా అదే విధంగా పనిచేస్తోందన్నారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత జరుగుతున్న రెండో పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని, అన్ని అంశాలపై లోతుగా పరిశీలన చేసుకుంటామన్నారు. క్షేత్రస్థాయిలోని నాయకత్వం, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుంటామని, ప్రజలకు మరింత మేలు జరగాలంటే ఏం చేయవచ్చన్నదానిపై ప్రతినిధుల సభలో చర్చిస్తామన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన పార్టీగా ఉద్యమ సమయంలో అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేశామని చెప్పారు.  అకుంఠిత దీక్షతో ఉద్యమం నడిపిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పాలనపై తనదైన ముద్ర వేస్తున్నారని కొనియాడారు. నాలుగు వేల మంది ప్రతినిధులతో జరిగే ఈ సమావేశానికి గుర్తింపుకార్డులు ఇచ్చిన వారు మాత్రమే హాజరు కావాలని సూచించారు. ఈనెల 27న ఖమ్మం నగరంలో నిర్వహించనున్న పార్టీ ప్రతినిధుల సభకు 4 వేల మంది హాజరుకానున్నారని, వారందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వబోతున్నట్లు పేర్కొన్నారు.  ప్రతినిధుల సభ 27వ తేదీ ఉదయం 10 గంటలకు మొదలవుతుందని, దీనికి హాజరయ్యేవారు 26వ తేదీ రాత్రికల్లా ఖమ్మం నగరానికి చేరుకోవాలని సూచించారు. ప్రతినిధుల సభ తర్వాత బహిరంగ సభ ఉంటుందని, దీనికి పార్టీ కార్యకర్తలు సహా సానుభూతిపరులు ఎవరైనా హాజరుకావచ్చన్నారు. 15 సంవత్సరాల క్రితం ప్రారంభమైన తెరాస పార్టీ.. ఉద్యమం నుంచి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిందన్నారు. 50 లక్షల మంది కార్యకర్తల బలం తెరాసకు ఉందని, అందరికీ బీమా సౌకర్యం కల్పించామని చెప్పారు. పార్టీ కార్యకర్తలను సుశిక్షుతులైన సైనికులుగా మార్చేందుకు అవసరమైన శిక్షణ కూడా ఇవ్వబోతున్నామని తెలిపారు. కార్యకర్తలు, నాయకులకు నామినేటెడ్‌ పదవులు ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నింటిపైనా కసరత్తు

చేస్తున్నారని, తెలంగాణ రాష్టాన్న్రి  అన్నిరంగాల్లో మొదటి స్థానంలో నిలబెట్టడమే తమ లక్ష్యమన్నారు. ప్రభుత్వానికి పార్టీనే గుండెకాయ అని, అందుకే పార్టీని పటిష్ఠం చేసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పార్టీ ఎన్నికల ముందు విడుదల చేసిన ప్రణాళికలో 90శాతం అంశాలను ఇప్పటికే నెరవేర్చామని, అందులో లేని పథకాలనూ అమలు చేశామని గుర్తు చేశారు.   ఖమ్మం జిల్లాలో తొలిసారిగా ప్లీనరీ నిర్వహించుకుంటున్నామని, అందులో 15 అంశాలపై తీర్మానాలు ఉంటాయన్నారు. విపక్ష పార్టీలు ఏకమైనా పాలేరులో తెరాస విజయం ఖాయమని మంత్రి  చెప్పారు. తెరాసను ఢీకొనే సత్తా ఇతర పార్టీలకు లేదన్నారు.